దంబుల్లా: ముక్కోణపు వన్డే సిరీస్‌లో యువ భారత్ జయకేతనం ఎగురవేసింది. అన్నింటా ఆధిపత్యం ప్రదర్శించిన కుర్రాళ్లు శ్రీలంక గడ్డపై సింహనాదం చేశారు. టోర్నీలో పేలవ ఫామ్‌తో విమర్శలకు గురైన యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టైటిల్ పోరులో ఆకాశమే హద్దుగా చెలరేగిన వేళ భారత్ ‘ఏ’ ట్రోఫీని సగర్వంగా ముద్దాడింది. ఆదివారం జరిగిన ఫైనల్లో హైదరాబాదీ తిలక్‌వర్మ సారథ్యంలోని భారత్ ‘ఏ’ 66 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. చిచ్చరపిడుగు సూర్యవంశీ(29 బంతుల్లో 94, 10ఫోర్లు, 8సిక్స్‌లు) వీరవిహారానికి తోడు కెప్టెన్ తిలక్‌వర్మ(90 బంతుల్లో 67, 4ఫోర్లు, సిక్స్) అర్ధసెంచరీతో భారత్ ‘ఏ’ 50 ఓవర్లలో 377-9 భారీ స్కోరు చేసింది. లంక బౌలర్లను ఊచకోత కోస్తూ సూర్యవంశీ కేవలం 11 బంతుల్లోనే అర్ధసెంచరీ మార్క్ అందుకున్నాడు.
లిస్ట్-ఏ క్రికెట్లో ఇది సరికొత్త రికార్డుగా నమోదైంది. లంక బౌలర్లకు పట్టపగలే చుక్కలు చూపించిన ఈ బీహార్ బుడ్డోడు ఫోర్లు, సిక్స్‌లతో చెలరేగాడు. పిచ్‌పై బంతి పడటం ఆలస్యం దాని గమ్యస్థానం బౌండరీ అన్న తరహాలో సూర్యవంశీ చెలరేగిన తీరు అభిమానులను కట్టిపడేసింది. సహాన్(2-39), రవిందు ఫెర్నాండో(2-72), మతులాన్(2-82) రెండేసి వికెట్లు తీశారు. భారీ లక్ష్యఛేదనలో లంక ‘ఏ’ 47.1 ఓవర్లలో 311 ఆలౌటైంది. వనుజ సహాన్(62), సదీరా సమరవిక్రమ(52) అర్ధసెంచరీలతో ఆకట్టుకోగా, మిగతావారు విఫలమయ్యారు. యశ్ ఠాకూర్(3-45), విప్రాజ్ నిగమ్(3-60) మూడేసి వికెట్లతో లంక పతనంలో కీలకమయ్యారు. ధనాధన్ అర్థసెంచరీతో జట్టు విజయంలో కీలకమైన సూర్యవంశీకి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.
టాస్ గెలిచిన కెప్టెన్ తిలక్‌వర్మ..మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకోవడం భారత్ ‘ఏ’కు కలిసొచ్చింది. సిరీస్‌లో భారీ స్కోర్లు చేయలేకపోయిన వైభవ్ కీలకమైన ఫైనల్లో తన ప్రతాపమేంటో చూపెట్టాడు. లంకతో ‘సూపర్ ఓవర్’ పోరులో జరిగిన ఘటనను దృష్టిలో పెట్టుకున్న వైభవ్ అంతే కసిగా ఆడాడు. ప్రియాంశ్ ఆర్య(39) జతగా ఈ యువ ఓపెనర్ విధ్వంసానికి వ్యూహరచన చేశాడు. బౌలర్ ఎవరన్నది లెక్కచేయని నైజంతో బ్యాటింగ్‌కు వచ్చిన ఈ బుడ్డోడు తాను ఎదుర్కొన్న తొలి 11 బంతుల్లోనే మ్యాచ్ గతిని మార్చేశాడు. వరుస బంతుల్లో 4,4,4, 6,6, 0, 6,4,4, 6,6తో 50 పరుగుల మార్క్ అందుకున్నాడు.
ఇక్కడే సూర్యవంశీ విస్ఫోటం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. లంక బౌలర్లను గల్లీ ప్లేయర్లుగా మారుస్తూ వైభవ్ కొట్టిన కొట్టుడుకు బౌండరీలు చిన్నబోయాయి. లంక పేసర్ దులజ్ సముదితను వైభవ్ ఓ ఆటాడుకున్నాడు. ప్రత్యర్థి పేసర్లను లక్ష్యంగా చేసుకుంటూ ఆన్‌సైడ్ దిశగా వైభవ్ బౌండరీల వర్షం కురపించాడు. ఈ 15 ఏండ్ల కుర్రాడిని అడ్డుకునేందుకు ఆన్‌సైడ్‌లో ఎక్స్ట్రా ఫీల్డర్‌ను మోహరించినా..లాభం లేకపోయింది. ఎక్స్ట్రా కవర్లో వైభవ్ లాఫ్టెడ్ షాట్స్ సిక్స్‌లు మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచాయి. గుడ్‌లెంగ్త్ బంతులను కూడా వదిలిపెట్టని ఈ యువ బ్యాటర్ తన ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 8 భారీ సిక్స్‌లతో చెలరేగాడు.
సెంచరీకి మరో ఆరు పరుగుల దూరంలో అరచింగె బౌలింగ్‌లో క్యాచ్ ఔట్ కావడంతో తొలి వికెట్‌కు 132 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. సూర్యవంశీ అందించిన శుభారంభాన్ని సహచర బ్యాటర్లు కొనసాగించారు. రుతురాజ్ గైక్వాడ్ (40), తిలక్‌వర్మ, కుమార్ కుశాగ్ర (36), ఆఖర్లో అనుకూల్‌రాయ్(15 బంతుల్లో 39, ఫోర్, 4సిక్స్‌లు) బ్యాట్లు ఝులిపించడంతో భారత్‌కు భారీ స్కోరు సాధ్యమైంది.
భారీ లక్ష్యఛేదనలో లంక ఇన్నింగ్స్ పడుతూ లేస్తూ సాగింది. యశ్ ఠాకూర్ ధాటికి లంక ‘ఏ’ టాపార్డర్ బ్యాటర్లు అవిష్క ఫెర్నాండో(3), నిరోషన్ డిక్వెల్లా (25), నువింద్ ఫెర్నాండో (21) వికెట్లు కోల్పోయింది. పిచ్ పరిస్థితులను అనుకూలంగా మలుచుకుంటూ ఠాకూర్ బౌలింగ్ జోరుకు లంక బ్యాటర్లు ఆదిలోనే పెవిలియన్ చేరుకున్నారు. సదీర సమరవిక్రమ (52), కెప్టెన్ సహాన్ అరచిగె(38) నాలుగో వికెట్‌కు 53 పరుగులు జోడించగా, సహాన్(62), విజయ్‌కాంత్(39) కలిసి ఏడో వికెట్‌కు 77 పరుగులు జోడించారు. అయితే ఛేదించాల్సిన లక్ష్యం ఎక్కువ ఉండటం వరుస విరామంలో వికెట్లు కోల్పోవడం లంక కొంపముంచింది. ఠాకూర్‌కు తోడు నిగమ్, అనుకూల్ రాయ్ (2-42) రాణించడం భారత్‌కు కలిసొచ్చింది.
9 లిస్ట్-ఏ క్రికెట్లో 11 బంతుల్లో అర్ధసెంచరీ చేసిన తొలి బ్యాటర్‌గా వైభవ్ నిలిచాడు. గతంలో లంక బ్యాటర్ కౌశల్య వీరరత్నె (12 బంతుల్లో) పేరిట ఉన్న రికార్డు తాజాగా చెదిరిపోయింది.
భారత్ ‘ఏ’: 50 ఓవర్లలో 377-9(వైభవ్ 94, తిలక్ 67, సహాన్ 2-39, ఫెర్నాండో 2-72),
శ్రీలంక ‘ఏ’: 47.1 ఓవర్లలో 311 ఆలౌట్(సహాన్ 62, సమరవిక్రమ 52, యశ్ ఠాకూర్ 3-45, నిగమ్ 3-60)