Usman Khawaja: పాలస్తీనా ప్రజలకు మద్దతు ప్రకటించేందుకు గాను ఆస్ట్రేలియా టెస్టు జట్టు ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా అంతర్జాతీయ క్రికెట్ నియంత్రణ మండలి (ఐసీసీ) నిబంధలనకు వ్యతిరేకంగా ముందుకెళ్లనున్నాడా..? అంటే అవుననే అంటున్నాడు. తన దృష్టిలో ప్రజలంతా సమానమేనని, ఆ సందేశాన్ని ఇవ్వడానికి తననెవరూ అడ్డుకోలేరని స్పష్టం చేస్తున్నాడు. రేపట్నుంచి (డిసెంబర్ 14) పాకిస్తాన్‌తో పెర్త్ వేదికగా జరగాల్సి ఉన్న తొలి టెస్టులో తాను వేసుకోబోయే షూస్‌పై ‘అందరి జీవితాలు సమానమే’ అని సందేశాన్ని ఇవ్వనున్నట్టు చెప్పకనే చెప్పాడు.
పెర్త్ టెస్టుకు ముందు జరిగిన ప్రాక్టీస్ సెషన్లో ఖవాజా.. ‘ఫ్రీడమ్ ఈజ్ హ్యూమన్ రైట్.. ఆల్ లివ్స్ ఆర్ ఈక్వల్’ (స్వేచ్ఛ మానవ హక్కు. అందరి జీవితాలు సమానమే) అన్న సందేశాన్ని రాసి ఉన్న షూస్ వేసుకున్నాడు. అయితే అతడు ఇదంతా ఇజ్రాయెల్ దాడిలో అతలాకుతులమవుతున్న పాలస్తీనా ప్రజలకు మద్దతుగా ఇలా చేస్తున్నాడని విమర్శలు వెల్లువెత్తాయి. ఇది ఐసీసీ నిబంధనలకు విరుద్ధమని తెలిసినా తాను మాత్రం వెనక్కి తగ్గనని ఖవాజా అన్నాడు. ఖవాజా షూస్‌పై చర్చ జరుగుతున్న వేళ అతడు ఇన్స్టాగ్రామ్ వేదికగా స్పందిస్తూ… ‘చాలామంది నేను వేసుకున్న షూస్ గురించి ఏదేదో మాట్లాడుతున్నారు. దీని గురించి నేను వివరంగా చెప్పాల్సిన పన్లేదు. కానీ నన్ను ప్రశ్నిస్తున్నవారికి ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి. స్వేచ్ఛ అందరికీ వర్తించదా..? అందరి జీవితాలు సమానం కావా..?’ అని ప్రశ్నించాడు.
అంతేగాక ‘వ్యక్తిగతంగా నాకు మతం, జాతి, సంస్కృతి వంటివాటితో సంబంధం లేదు. మనుషులంతా సమానమే అంటే కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. దీనిని ఎందుకు వ్యతిరేకిస్తున్నారో చెప్పండి. అదేమైనా పెద్ద సమస్యా..? నేను ఇదేదో కొంతమంది ప్రజలకో, ఒక వర్గం కోసమో చేయడం లేదు. ఇందులో రాజకీయమూ లేదు. నాకు సంబంధించినంతవరకు అందరి జీవితాలూ సమానమే. ఒక యూధుడైనా, ముస్లిమైనా, హిందూవైనా.. మనుషులుగా అందరూ సమానమే. గొంతులేని వారికి నేను గొంతుకనవుతున్నా.. నా కండ్ల ముందు అమాయకులైన వందలాదిమంది చిన్నపిల్లలు చనిపోతుంటే ఎలాంటి పశ్చత్తాపం లేకుండా నేను ఎలా ఉండగలను..? నాకూ ఇద్దరు కూతుళ్లున్నారు. వాళ్లకే ఇది జరిగితే ఎలా..? నేను పెరుగుతున్నప్పుడే నా జీవితం అందరితో సమానం కాదన్న విషయాన్ని గ్రహించాను. కానీ అదృష్టవశాత్తూ జీవితానికి, మరణానికి సమానత్వం లేని సమాజంలో నేను లేను. ఈ షూస్‌లో పొలిటికల్ స్టేట్మెంట్ ఉందని, అవి ధరించొద్దని ఐసీసీ నాతో చెప్పింది. కానీ నేనైతే అలా అనుకోవడం లేదు. నేను ఇది చేస్తున్నది మానవత దృక్పథంతో మాత్రమే.. నేను వాళ్ల (ఐసీసీ) అభిప్రాయాన్ని గౌరవిస్తాను. కానీ నేను దీనిపై పోరాడతాను. వాళ్ల ఆమోదం పొందుతాను.. నా దృష్టిలో అందరూ సమానమే. నన్ను విమర్శించేవాళ్లు దీనిని అంగీకరించినా లేకున్నా నేను మాత్రం ఇదే నమ్ముతా..’అని పేర్కొన్నాడు.