‘బేస్‌బాల్, బాస్కెట్‌బాల్‌కు అమితమైన క్రేజ్ ఉన్న అమెరికాలో క్రికెట్ సక్సెస్ అవుతుందా? ఆతిథ్య హోదాలో యూఎస్ఏ ఉనికిని చాటుతుందా?’ అన్న అనుమానాలన్నింటినీ పటాపంచలు చేస్తూ అమెరికా క్రికెట్ జట్టు అద్భుతమే చేసింది. అవకాశమొస్తే సత్తా చూపించేందుకు ‘మేం కూడా సిద్ధం’ అని తొలి మ్యాచ్‌తోనే ప్రపంచానికి ఘనంగా చాటి చెప్పింది. అగ్రశ్రేణి జట్లు సైతం ఒకటికి రెండుసార్లూ ఆలోచించి బరిలోకి దిగే రికార్డు ఛేదన (195)ను అంతర్జాతీయ క్రికెట్లో, మరీ ముఖ్యంగా ఈ ఫార్మాట్లో అంతగా అనుభవం లేని యూఎస్ఏ 3 వికెట్లు మాత్రమే కోల్పోయి మరో 14 బంతులుండగానే ఊదేసింది. భారీ ఛేదనలో ఆ జట్టు మిడిలార్డర్ బ్యాటర్ ఆరోన్ జోన్స్ వీరవిహారం చేయగా ఆండ్రిస్ గోస్ అతడికి అండగా నిలిచాడు. బ్యాటింగ్‌లో రాణించిన కెనడా.. బౌలింగ్‌లో విఫలమై మూల్యం చెల్లించుకుంది.
T20 World Cup | డల్లాస్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని వెస్టిండీస్/అమెరికాలలో సంయుక్తంగా నిర్వహిస్తోన్న తొమ్మిదవ టీ20 ప్రపంచకప్ ఎడిషన్‌కు ఘనమైన ఆరంభం. ఈ ఫార్మాట్‌కు తొలిసారి ఆతిథ్యమిస్తున్న యూనైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (యూఎస్ఏ).. తమ ప్రారంభ మ్యా చ్లోనే కెనడాను ఏ డు వికెట్ల తేడాతో చిత్తుచేసి సంచలన విజ యం దక్కించుకుంది. రికార్డులు బద్ధలైన ఈ మ్యాచ్‌లో కెనడా నిర్దేశించిన 195 పరుగుల ఛేదనలో 3 వికెట్లు మాత్రమే నష్టపోయి 17.4 ఓవర్లలోనే పూర్తిచేసి చారిత్రాత్మక విజయాన్ని నమోదుచేసింది. లక్ష్య ఛేదనలో ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ ఆరోన్ జోన్స్ (40 బంతుల్లో 94 నాటౌట్, 4 ఫోర్లు, 10 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగి ప్రత్యర్థి బౌలర్లపై వీరవిహారం చేయగా ఆండ్రిస్ గోస్ (46 బంతుల్లో 65, 7 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించి ఆ జట్టుకు ఘనవిజయాన్ని అందించారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన కెనడా.. నవ్‌నీత్ ధలివల్ (44 బంతుల్లో 61, 6 ఫోర్లు, 3 సిక్సర్లు), నికోలస్ కిర్టన్ (31 బంతుల్లో 51, 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించడంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది.
48/2. 195 పరుగుల ఛేదనలో 8 ఓవర్లు ముగిసేసరికి అమెరికా చేసిన స్కోరది. చివరి 72 బంతుల్లో ఆ జట్టు విజయానికి 147 పరుగులు కావాలి. చేతిలో వికెట్లు ఉన్నా ఒత్తిడిలో చిత్తుకాకపోతారా? అని కెనడా ఆశలు. కానీ గోస్, జోన్స్ ప్రత్యర్థికి ఆ అవకాశమే ఇవ్వలేదు. నిఖిల్ దత్తా వేసిన 9వ ఓవర్లో 19 పరుగులు రాబట్టడంతో ఈ ఇద్దరూ బాదుడుకు శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత 9 ఓవర్ల పాటు ఈ జోడీకి అడ్డుకట్ట వేసేందుకు కెనడా చేసిన ఏ ప్రయత్నమూ ఫలించలేదు. జఫర్ వేసిన 13వ ఓవర్లో రెండు సిక్సర్లు బాది 22 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తిచేసిన జోన్స్ ఆ తర్వాత మరింత ప్రమాదకరంగా మారాడు. గోర్డాన్ 14వ ఓవర్లో గోస్ 6,4తో ఫిఫ్టీ పూర్తిచేసుకున్నాడు. ఈ ఓవర్లో అమెరికా ఏకంగా 33 పరుగులు పిండుకోవడంతో ఆ జట్టు విజయం దాదాపు ఖరారైంది. దూకుడుగా ఆడే క్రమంలో గోస్ 16వ ఓవర్లో నిష్క్రమించినా జోన్స్ మాత్రం పట్టు వీడలేదు. నిఖిల్ 18వ ఓవర్లో 4, 6, 6తో అమెరికాకు రికార్డు ఛేదనను అందించాడు. మూడో వికెట్‌కు జోన్స్, గోస్ కలిపి 131 పరుగులు జోడించడం గమనార్హం. కెనడా బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు.
అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన కెనడా సైతం ధాటిగానే ఆడింది. ఓపెనర్లు ఆరోన్ జాన్సన్ (23), నవ్‌నీత్ తొలి వికెట్‌కు 43 పరుగులు జోడించారు. జాన్సన్ ఔట్ అయినా నికోలస్‌తో కలిసి నవ్‌నీత్.. వేగంగా ఆడాడు. వీరికి అడ్డుకట్ట వేసేందుకు అమెరికా ఏకంగా ఏడుగురు బౌలర్లను ఉపయోగించినా ఈ జోడీ దూకుడు తగ్గలేదు. 37 బంతుల్లో అర్ధ శతకాలు పూర్తిచేశాక కొద్దిసేపటికే ఈ ఇద్దరూ పెవిలియన్ చేరినా ఆఖర్లో శ్రేయస్ మొవ్వ (16 బంతుల్లో 32 నాటౌట్, 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ధాటిగా ఆడి కెనడాకు భారీ స్కోరును అందించాడు.
2 టీ20 వరల్డ్ కప్ ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు (10) బాదిన రెండో బ్యాటర్ జోన్స్. గతంలో ఈ రికార్డు క్రిస్ గేల్ (11) పేరిట ఉంది.
3 పొట్టి ప్రపంచకప్‌లో ఇది మూడో అత్యుత్తమ ఛేదన. ఇంగ్లాండ్ (సౌతాఫ్రికాపై 230), సౌతాఫ్రికా (విండీస్‌పై 206) తర్వాత అమెరికా నిలిచింది.
కెనడా: 20 ఓవర్లలో 194/5 (నవ్‌నీత్ 61, నికోలస్ 51, హర్మీత్ 1/27, అండర్సన్ 1/29)
యూఎస్ఏ: 17.4 ఓవర్లలో 197/3 (జోన్స్ 94 నాటౌట్, ఆండ్రిస్ 65, డిల్లాన్ 1/19, కలీమ్ 1/34)