న్యూయార్క్ : యూఎస్ ఓపెన్‌లో నయా స్పెయిన్ బుల్ కార్లొస్ అల్కరాజ్ జోరు కొనసాగుతున్నది. ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ గెలిచి వింబుల్డన్‌లో ఫైనల్ చేరిన ఈ స్పెయిన్ కుర్రాడు.. తాజాగా యూఎస్ ఓపెన్ ప్రిక్వార్టర్స్‌కు ప్రవేశించాడు. శుక్రవారం ఇక్కడి ఆర్థర్ ఆషే స్టేడియం వేదికగా జరిగిన పురుషుల సింగిల్స్ మూడో రౌండ్ మ్యాచ్‌లో రెండో సీడ్ అల్కరాజ్.. 6-2 6-4, 6-0తో లుసియానొ (ఇటలీ)ని మట్టికరిపించి నాలుగో రౌండ్‌కు ముందంజ వేశాడు. పూర్తి ఏకపక్షంగా జరిగిన మ్యాచ్‌ను అల్కరాజ్.. గంటా 44 నిమిషాల్లోనే ముగించాడు. యూఎస్ ఓపెన్‌లో ఈ కుర్రాడికి ఇది 20వ విజయం. అదీగాక అత్యంత పిన్న వయసులో 80 గ్రాండ్‌స్లామ్ మ్యాచ్‌లు గెలిచిన ప్లేయర్‌గా అల్కరాజ్ రికార్డులకెక్కాడు.
డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన ఇటలీ సంచలనం యానిక్ సిన్నర్.. టైటిల్‌ను దక్కించుకునే దిశగా మరో ముందడుగు వేశాడు. పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో ప్రపంచ ఒకటో ర్యాంకర్ సిన్నర్.. 6-3, 6-2, 6-2తో అలెక్సి పొప్రిన్ (ఆస్ట్రేలియా)పై అలవోకగా గెలిచాడు. రెండు గంటల పాటు జరిగిన పోరులో వరుస సెట్లను గెలుచుకున్న సిన్నర్.. 6 ఏస్‌లు, 26 విన్నర్లు కొట్టాడు. మరో మ్యాచ్‌లో మూడో సీడ్ అలగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ).. 6-4, 6-4, 6-4తో జాకబ్ ఫియర్న్లీ (బ్రిటన్)పై పెద్దగా కష్టపడకుండానే గెలిచాడు. ఆరో సీడ్ అమెరికా కుర్రాడు బెన్ షెల్టన్.. 6-4, 6-2, 6-4తో పాబ్లొ కరెనొ (స్పెయిన్)ను మట్టికరిపించి మూడో రౌండ్‌కు ప్రవేశించాడు. 8వ సీడ్ అలెక్స్ డి మినార్ (ఆస్ట్రేలియా).. 6-2, 6-4, 6-2తో షింటారొ (జపాన్)ను ఓడించాడు.
మహిళల సింగిల్స్‌లో ఎలీనా రిబాకినా (కజకిస్థాన్) ప్రిక్వార్టర్స్ చేరింది. మూడో రౌండ్లో 9వ సీడ్ రిబాకినా.. 6-1, 6-2తో బ్రిటీష్ అమ్మాయి ఎమ్మా రడుకానును చిత్తుచేసింది. బలమైన సర్వీసులతో అలవోకగా తొలి సెట్‌ను గెలుచుకున్న కజకిస్థాన్ అమ్మాయి.. రెండో సెట్లో ప్రత్యర్థిపై అదే ఒత్తిడిని పెంచుతూ వరుసగా పాయింట్లు కొల్లగొట్టింది. ప్రిక్వార్టర్స్‌లో ఆమె.. పౌలోని, వొండ్రుసొవా మధ్య జరిగే మ్యాచ్‌లో విజేతతో తలపడనుంది. మరో మ్యాచ్‌లో అమెరికా సంచలనం మూడో సీడ్ కోకో గాఫ్ (అమెరికా).. 7-6 (7/5), 6-2తో డొన వెకిచ్ (క్రొయేషియా)ను ఓడించి మూడో రౌండ్‌కు ప్రవేశించింది. పోలండ్ బామ ఇగా స్వియాటెక్.. 6-1, 4-6, 6-4తో సుజాన్ లామెన్స్ (నెదర్లాండ్స్)పై విజయం సాధించింది. మాజీ చాంపియన్ నవొమి ఒసాకా.. 6-3, 6-1తో బాప్టిస్ట్ (అమెరికా)పై గెలిచింది.