ఇండోర్: ఇటీవలే ముగిసిన ఐపీఎల్ మెగా వేలంలో తనను దక్కించుకోనందుకు ఫ్రాంచైజీలు పశ్చాత్తాప్పడేలా చేస్తున్నాడు గుజరాత్ బ్యాటర్ ఉర్విల్ పటేల్. దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (స్మాట్)లో వారం రోజుల క్రితమే 28 బంతుల్లో శతకం బాది భారత్ తరఫున పొట్టి ఫార్మాట్లో వేగవంతమైన సెంచరీని నమోదు చేసిన ఈ గుజరాత్ బ్యాటర్.. తాజాగా మరోసారి అదే ఫీట్‌ను రిపీట్ చేశాడు.
గ్రూప్-బీలో భాగంగా ఉత్తరాఖండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఉర్విల్ (41 బంతుల్లో 115 నాటౌట్; 8 ఫోర్లు, 11 సిక్సర్లు) 36 బంతుల్లోనే సెంచరీని పూర్తి చేశాడు. అతడి ధాటికి ఉత్తరాఖండ్ నిర్దేశించిన 185 పరుగుల లక్ష్యం చిన్నబోయింది. 13.1 ఓవర్లలోనే గుజరాత్ ఛేదనను పూర్తిచేసింది. స్మాట్‌లో ఆడిన 6 మ్యాచ్‌లలో ఐదో విజయం కావడం గమనార్హం. ఈ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో ఉర్విల్ (5 మ్యాచ్‌లలో 282) ఐదో స్థానంలో ఉన్నాడు.