న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో అత్యుత్తమ పిచ్, మైదానం అవార్డును హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ)కు చెందిన ఉప్పల్ క్రికెట్ స్టేడియం కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన ఐపీఎల్ ఫైనల్ ముగింపు కార్యక్రమంలో ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడు చాముండేశ్వరీనాథ్ చేతుల మీదుగా హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్రావు అవార్డు స్వీకరించారు. దీంతో పాటు హెచ్‌సీఏకు రూ.50లక్షల నగదు ప్రోత్సాహం లభించింది.
ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ ‘ఐపీఎల్ మ్యాచ్‌లను విజయవంతంగా నిర్వహించేందుకు కార్యదర్శి దేవరాజ్‌తో పాటు ఇతర అపెక్స్ కౌన్సిల్ సభ్యులు, హెచ్‌సీఏ సిబ్బంది అహర్నిశలు శ్రమించారు. ముఖ్యంగా చీఫ్ క్యూరేటర్ చంద్రశేఖర్, ఇతర గ్రౌండ్స్‌మెన్ చాలా కష్టపడ్డారు. ఈ అవార్డు హెచ్‌సీఏ కుటుంబ సభ్యుల శ్రమకు ప్రతిఫలం’ అని అన్నారు. ఇదిలా ఉంటే లీగ్ మొత్తంగా అద్భుతమైన పిచ్‌లు తయారు చేసిన పది వేదికలకు చెందిన క్యూరేటర్స్, గ్రౌండ్స్‌మెన్‌కు 25లక్షల చొప్పున బీసీసీఐ కార్యదర్శి జై షా నగదు ప్రోత్సాహం ప్రకటించారు.