UP Warriorz : మహిళల ప్రీమియర్ లీగ్‌లో ట్రోఫీ కోసం నిరీక్షిస్తున్న యూపీ వారియర్స్ (UP Warriorz) షాకింగ్ నిర్ణయం తీసుకుంది. గత సీజన్లో జట్టు ప్రదర్శనతో తీవ్రంగా నిరాశ చెందిన యాజమాన్యం హెడ్‌కోచ్ జాన్ లెవిస్(Jon Lewis)కు ఉద్వాసన పలికింది. నాలుగో సీజన్‌కు కొత్త కోచ్ ఆధ్వర్యంలో పక్కాగా సన్నద్ధం కావాలనే ఉద్దేశంతో లెవిస్పై వేటు వేసింది. ఈ విషయాన్ని శుక్రవారం యూపీ యాజమాన్యం ఎక్స్ వేదికగా వెల్లడించింది.
‘మొదటి రోజు నుంచి మీరు మమ్మల్ని ఎంతగానో విశ్వసించారు. ఈ క్రమంలో యూపీ వారియర్స్ జట్టు ఎన్నో ఎత్తుపల్లాలు చవిచూసింది. ఫ్రాంచైజీలోని క్రికెటర్లు ఎన్నో విషయాలు నేర్చుకున్నారు. మీరు ప్రశాంతంగా ఉంటూనే జట్టు పురోగతి కోసం మనసుపెట్టి పనిచేశారు. కోచ్ జాన్ లెవిస్ మీ సేవలకు ధన్యవాదాలు. మీరు ఎల్లప్పుడూ యూపీ వారియర్స్ కుటుంబంలో సభ్యులే’ అంటూ సోషల్ మీడియా పోస్ట్‌లో రాసుకొచ్చింది యూపీ ఫ్రాంచైజీ.
From day one, you believed in us. 💛💜
Through the highs, the learnings, and everything in between — Thank You, Coach Jon Lewis, for leading with heart, calm, and belief. 👊
You’ll always be a part of the Warriorz Family. 🫶 pic.twitter.com/qZpJDyj9Ut
— UP Warriorz (@UPWarriorz) June 27, 2025
మహిళల క్రికెట్‌ను కొత్త పుంతలు తొక్కించడం కోసం బీసీసీఐ 2023లో డబ్ల్యూపీఎల్‌ను ఆరంభించింది. తొలి సీజన్ నుంచి బరిలోకి దిగుతున్న ఐదు జట్లలో యూపీ వారియర్స్ ఒకటి. ఆరంభ ఎడిషన్‌లో జాన్ లెవిస్ మార్గనిర్దేశనంలో యూపీ జట్టు ప్లే ఆఫ్స్ వరకూ వెళ్లింది. నాకౌట్ పోరు ముంబై ఇండియన్స్ చేతిలో ఓడి ఇంటిదారి పట్టింది. నిరుడు జరిగిన టోర్నీలో యూపీ మూడు విక్టరీలతో నాలుగో స్థానంలో నిలిచింది. మొత్తంగా డబ్ల్యూపీఎల్‌లో ఆ జట్టు 25 మ్యాచుల్లో తొమ్మిదింట మాత్రమే గెలుపొందింది.
ఇంగ్లండ్ మాజీ ఆటగాడైన జాన్ లెవిన్‌కు కోచ్‌గా సుదీర్ఘ అనుభవం ఉంది. డబ్ల్యూపీఎల్‌లో యూపీ వారియర్స్‌కు కోచింగ్ ఇస్తూనే ఆయన నిరుడు నవంబర్ 22 నుంచి ఈ ఏడాది మార్చి వరకూ ఇంగ్లండ్ మహిళల టీమ్‌కు సేవలందించాడు. దేశవాళీలో కౌంటీ క్రికెట్లో గ్లౌసెస్టర్షైర్, సర్రేతో పాటు సస్సెక్స్ జట్లుకు సైతం ఆడాడు లెవిస్. అయితే.. దేశం తరఫున మాత్రం ఆయన కెరియర్ కొన్ని రోజులే కొనసాగింది. ఇంగ్లండ్ జెర్సీతో లెవిస్ ఒక టెస్టు, 13 వన్డేలు, రెండు టీ20లు ఆడాడంతే.