Urvil Patel | ఇండోర్: గుజరాత్ బ్యాటర్ ఉర్విల్ పటేల్ విధ్వంసకర మెరుపులకు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (స్మాట్)లో పాత రికార్డులన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. త్రిపురతో ఇండోర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో అతడు.. 28 బంతుల్లోనే శతకాన్ని పూర్తిచేశాడు. ఈ క్రమంలో అతడు టీ20లలో అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన భారత బ్యాటర్‌గా రికార్డులకెక్కాడు. అంతకుముందు ఈ రికార్డు రిషభ్ పంత్ (హిమాచల్ ప్రదేశ్‌పై 32 బంతుల్లో) పేరిట ఉంది.
మొత్తంగా పొట్టి ఫార్మాట్లో ఫాస్టెస్ట్ సెంచరీ.. ఈస్తోనియాకు చెందిన సాహిల్ చౌహాన్ (27 బంతుల్లో) ఖాతాలో ఉండగా ఉర్విల్ రెండో స్థానాన నిలిచాడు. ఇక త్రిపురతో మ్యాచ్‌లో ఉర్విల్ 35 బంతుల్లోనే 7 బౌండరీలు, 12 భారీ సిక్సర్లతో 113 పరుగులు చేసి అజేయంగా నిలవడంతో 156 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ 10.2 ఓవర్లలోనే ఛేదించింది. కాగా మూడు రోజుల క్రితం ముగిసిన ఐపీఎల్ వేలంలో ఉర్విల్ అన్‌సోల్డ్‌గా మిగలడం గమనార్హం.