ప్రతిష్ఠాత్మక అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు శుభారంభం చేసింది. ఐసీసీ తొలిసారి నిర్వహిస్తున్న మెగాటోర్నీలో యంగ్‌ఇండియా అదిరిపోయే బోణీ కొట్టింది. మొదట బౌలర్లు రాణించి ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే పరిమితం చేయగా..ఆనక బ్యాటింగ్‌లో షఫాలీ వర్మ సుడిగాలి ఇన్నింగ్స్‌తో విరుచుకుపడింది.ఎడాపెడా ఫోర్లు సిక్సర్లతో జట్టుకు గట్టి పునాది వేస్తే.. మరో ఓపెనర్
శ్వేత షెరావత్ అజేయ అర్ధసెంచరీతో జట్టుకు విజయాన్ని కట్టబెట్టింది.
బెనోని: ఓపెనర్లు దుమ్మురేపడంతో అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత్ తొలి విజయం నమోదు చేసుకుంది. దక్షిణాఫ్రికా వేదికగా జరగుతున్న మెగాటోర్నీలో శనివారం జరిగిన పోరులో భారత్ 7 వికెట్ల తేడాతో ఆతిథ్య దక్షిణాఫ్రికాను చిత్తుచేసింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. సిమన్ లారెన్స్ (44 బంతుల్లో 61; 9 ఫోర్లు, ఒక సిక్సర్) హాఫ్ సెంచరీతో ఆకట్టుకోగా.. మాడిసన్ (32) కీలక పరుగులు చేసింది. భారత బౌలర్లలో కెప్టెన్ షపాలీ వర్మ రెండు వికెట్లు పడగొట్టింది. అనంతరం లక్ష్యఛేదనలో యంగ్‌ఇండియా 16.3 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. ఓపెనర్లు శ్వేత షెరావత్ (57 బంతుల్లో 92 నాటౌట్; 20 ఫోర్లు), షఫాలీ వర్మ (16 బంతుల్లో 45; 9 ఫోర్లు, ఒక సిక్సర్) దంచికొట్టారు. తెలంగాణ బ్యాటర్ గొంగడి త్రిష (15; 3 ఫోర్లు) ఉన్నంతసేపు ధాటిగా ఆడే ప్రయత్నం చేసింది. అజేయ ఇన్నింగ్స్‌తో జట్టు ను గెలిపించిన శ్వేతకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. భార త్ తమ తదుపరి మ్యాచ్‌లో సోమవా రం యూఏఈతో తలపడనుంది.
దంచుడే దంచుడు..
అంతర్జాతీయ స్థాయిలో సీనియర్ జట్టు తరఫున ఇప్పటికే ఎన్నో మ్యాచ్‌లాడిన షఫాలీ వర్మ.. క్రీజులో అడుగుపెట్టినప్పటి నుంచే దక్షిణాఫ్రికాపై యుద్ధం ప్రకటించింది. బంతి తన పరిధిలో ఉంటే చాలు దానిపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడిన యువ సారథి.. ఆరో ఓవర్లో 4,4,4,4,4,6తో 26 పరుగులు రాబట్టింది. మంచినీళ్ల ప్రాయంలా బౌండ్రీలు బాదుతూ లక్ష్యాన్ని కరిగించింది. దీంతో.. పవర్‌ప్లే ముగిసేసరికి భారత్ వికెట్ నష్టపోకుండా 70 పరుగులు చేసింది. తొలి వికెట్‌కు 77 పరుగులు జోడించిన అనంతరం షఫాలీ ఔట్ కాగా.. అక్కడి నుంచి శ్వేత దంచుడు మొదలెట్టింది. మైదానం నలువైపులా షాట్లు ఆడిన శ్వేత ఏకంగా 20 ఫోర్లు నమోదు చేయడం విశేషం.
సంక్షిప్త స్కోర్లు
దక్షిణాఫ్రికా: 166/5 (సిమన్ 61; షఫాలీ 2/31),
భారత్: 16.3 ఓవర్లలో 170/3 (శ్వేత 92*, షఫాలీ 45).