Team India | సింగపూర్: అరంగేట్రం మహిళల అండర్-19 ఆసియాకప్ టోర్నీలో భారత్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో యువ భారత్ 4వికెట్ల తేడాతో శ్రీలంకపై ఘన విజయం సాధించింది. టోర్నీలో అపజయమెరుగని భారత్..తుది పోరులో నిలిచింది. తొలుత ఆయూశీ శుక్లా(4/10) ధాటికి లంక 20 ఓవర్లలో 98/9 స్కోరుకు పరిమితమైంది. ఈ యువ లెఫ్టార్మ్ స్పిన్నర్ ధాటికి లంక బ్యాటర్లు స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. కెప్టెన్ మనుడి నానయకర(33) టాప్‌స్కోరర్‌గా నిలిచింది.
పిచ్ పరిస్థితులను సద్వినియోగం చేసుకుంటూ ఆయూశి స్పిన్ మాయాజాలంతో చెలరేగడంతో లంక దగ్గర సరైన సమాధానం లేకపోయింది. ఓపెనర్లు సంజన(9), హిరుణి హన్సిక(2) 12 పరుగులకే పెవిలియన్ చేరగా, ఐదో వికెట్‌కు నానయకర, నిసానసల నెలకొల్పిన 22 పరుగుల భాగస్వామ్యం అత్యుత్తమమైంది.
ఆయూశీకి తోడు పరునిక సిసోడియా(2/27) రెండు వికెట్లు పడగొట్టారు. ఆ తర్వాత 99 పరుగుల కోసం లక్ష్యఛేదనకు దిగిన భారత్ 14.5 ఓవర్లలో 102/6 స్కోరు చేసింది. పరుగుల ఖాతా తెరువకుండానే ఐశ్వరి(0) ఔట్ కాగా, కమలిని(28) ఆకట్టుకుంది. టోర్నీలో తన సూపర్‌ఫామ్‌ను కొనసాగిస్తున్న తెలంగాణ యువ బ్యాటర్ గొంగడి త్రిష(32) అత్యధిక స్కోరుతో జట్టు విజయంలో కీలకమైంది. లంక బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ త్రిష తన ఇన్నింగ్స్‌లో 2 ఫోర్లు, 3 భారీ సిక్స్‌లతో అలరించింది. సనిక(4), కెప్టెన్ నికి ప్రసాద్(3), భవిక(7) విఫలమయ్యారు. ప్రభోద (3/16), గిమ్హాని (2/18) ఆకట్టుకున్నారు. నాలుగు వికెట్లతో విజయంలో కీలకమైన ఆయూశికి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.
శ్రీలంక: 20 ఓవర్లలో 98/9(నానయకర 33, నిసానసల(21), ఆయూశి 4/10, పరునిక 2/27),
భారత్: 14.5 ఓవర్లలో 102/6 (త్రిష 32, కమలిని 28, ప్రభోద 3/16, గిమ్హాని 2/18)