చెన్నై: ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్లో భాగంగా జరుగుతున్న ఫార్ములా 4 ఇండియన్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ రేసర్ అఖీల్ అలీభాయ్ మరోసారి మెరిశాడు. చెన్నైలోని మద్రాస్ ఇంటర్నేషనల్ సర్క్యూట్లో జరిగిన మూడో రౌండ్ నాలుగో రేసులో దక్షిణాఫ్రికాకు చెందిన అఖీల్.. రేసును 27 నిమిషాల 31.329 సెకన్లలో పూర్తిచేయడంతో అగ్రస్థానాన్ని దక్కించుకుని ట్రోఫీని కైవసం చేసుకున్నాడు. అంతకుముందు మిగిలిన మూడు రేసులకు గాను అతడు రెండింట్లో రన్నరప్‌గా నిలిచాడు. నాలుగో రేసులో అహ్మదాబాద్ అపెక్స్ రేసర్ డీవీ నందన్ (27 నిమిషాల 50.567 సెకన్లు) రెండో స్థానంతో సరిపెట్టుకోగా శ్రాచి బెంగాల్ టైగర్స్ రేసర్ రుహాన్ అల్వా (27 నిమిషాల 51.089 సెకన్లు) మూడో స్థానం సాధించాడు.మరోవైపు ఇండియన్ రేసింగ్ లీగ్ మూడో రౌండ్లో చెన్నై టర్బో రైడర్స్ జట్టు డబుల్ ధమాకా మోగించింది. తొలి రేసుతో పాటు రెండో రేసునూ ఆ జట్టు గెలిచింది.