హైదరాబాద్, ఆట ప్రతినిధి : ఐసీసీ మహిళల అండర్-19 టీ20 వరల్డ్ కప్‌నకు ఎంపికైన తెలంగాణ క్రికెటర్లు గొంగడి త్రిష, కేసరి ధృతిని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ఘనంగా సన్మానించింది. ఉప్పల్ స్టేడియంలో హెచ్‌సీఏ అధ్యక్షుడు అర్శనపల్లి జగన్మోహన్రావు ఈ ఇరువురిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా జగన్మోహన్రావు మాట్లాడుతూ.. ప్రతిష్టాత్మక వరల్డ్ కప్ వంటి మెగా టోర్నీకి ఇద్దరు తెలంగాణ క్రికెటర్లు ఎంపికవడం గర్వంగా ఉందన్నారు. వీళ్లు ఈ స్థాయికి చేరుకోవడానికి వారి తల్లిదండ్రులు, కోచ్‌లు పడిన శ్రమ మాటల్లో చెప్పలేనిదన్నారు. వర్దమాన క్రికెటర్లు వీరిని స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. జాతీయ జట్టుతో పాటు మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో మరింతమంది తెలంగాణ క్రికెటర్లు ప్రాతినిథ్యం వహించేలా తమ కార్యవర్గం కృషి చేస్తోందని జగన్మోహన్రావు తెలిపారు.