హాంగ్జౌ: ప్రతిష్ఠాత్మక బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో భారత యువ జోడీ గాయత్రి గోపీచంద్, త్రిసాజాలీకి శభారంభం దక్కలేదు. బుధవారం జరిగిన మహిళల డబుల్స్ తొలి రౌండ్ పోరులో గాయత్రి గోపీచంద్, త్రిసా జాలీ 22-20, 20-22,14-21తో చైనాకు చెందిన లు షెంగ్ షు, టాన్ నింగ్ ద్వయం చేతిలో ఓటమిపాలైంది. ఆద్యంతం హోరాహోరీగా సాగిన పోరులో గాయత్రి, త్రిసా తొలి గేమ్‌ను కైవసం చేసుకుని జోరు కనబరిచారు.
కానీ పారిస్ ఒలింపిక్స్ రజత విజేత అయిన షెంగ్ షు, టాన్ నింగ్ అద్భుతంగా పుంజుకుని పోటీలోకి వచ్చారు. నెట్ గేమ్‌తో పాటు కండ్లు చెదిరే స్మాష్‌లతో చెలరేగిన చైనా ద్వయం 17-12తో ఆధిక్యం కనబరిచింది. అయినా వెనుకకు తగ్గని భారత జంట 18-18తో డ్రా చేసినా చివరకు గేమ్‌ను చేజార్చుకున్నారు. మూడో గేమ్‌లో మరింత దూకుడు పెంచిన చైనా షట్లర్లు మ్యాచ్‌ను కైవసం చేసుకున్నారు.