Travis Head: ముగ్గురు దిగ్గజ క్రికెటర్లు పోటీపడ్డ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ గెలుచుకున్నాడు. నవంబర్ నెలకు గాను ట్రావిస్ హెడ్ ఈ అవార్డును సొంతం చేసుకున్నాడు. వన్డే ప్రపంచకప్ ఫైనల్లో సెంచరీ చేసి తన జట్టును గెలిపించిన హెడ్.. భారత స్టార్ పేసర్ మహ్మద్ షమీ, ఆసీస్ స్పిన్ ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్‌లను వెనక్కినెట్టి ఈ అవార్డును గెలుచుకున్నాడు. నవంబర్‌లో హెడ్.. 220 పరుగులు చేశాడు. ఇందులో ప్రపంచకప్ ఫైనల్ లో చేసిన శతకం (137) కూడా ఉంది.
తనకు ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు రావడంపై హెడ్ స్పందిస్తూ.. ‘ఏడాదికాలంగా మా జట్టు అన్ని ఫార్మాట్లలో నిలకడగా రాణిస్తోంది. ఈ జట్టులో నేను కూడా సభ్యుడిని కావడం నాకు గర్వంగా ఉంది. ఇండియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా టూర్లతో పాటు భారత్‌లో జరిగిన వన్డే ప్రపంచకప్ చాలా ప్రత్యేకం. కెప్టెన్ పాట్ కమిన్స్, జట్టు సభ్యులు సహకారం మరువలేనిది. ఐసీసీ అవార్డును గౌరవంగా భావిస్తున్నా. అందరి సహకారంతోనే ఇది సాధ్యమైంది.. ’ అని చెప్పాడు.
ఓపెనింగ్ చేయను..
త్వరలో పాకిస్తాన్‌తో స్వదేశంలో జరుగబోయే టెస్టు సిరీస్‌లో తాను ఓపెనింగ్ బ్యాటర్ రేసులో లేనని హెడ్ అన్నాడు. పెర్త్‌లో తనను కలిసిన మీడియాతో మాట్లాడుతూ… టెస్టులలో ఓపెనింగ్ అనేది స్పెషలిస్టు జాబ్ అని తాను మిడిలార్డర్‌కే పరిమితమవుతానని స్పష్టం చేశాడు. వన్డేలు, టీ20లలో ఓపెనింగ్గా వచ్చే హెడ్.. టెస్టులలో మాత్రం నాలుగు లేదా ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తాడు.