హైదరాబాద్ : విరాట్ కోహ్లీ(Virt kohli), ట్రావిస్ హెడ్ మధ్య జరిగిన వివాదం తాజాగా కొత్త మలుపు తీసుకుంది. ఆన్లైన్లో ట్రావిస్ హెడ్ భార్య జెస్సికాకు(Jessica) వేధింపులకు గురవుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఐపీఎల్ 2026లో భాగంగా మే 22న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్‌లో కింగ్ కోహ్లీ, ట్రావిస్ హెడ్ మధ్య వాగ్వాదం జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ వివాదం అక్కడితో సమసిపోయింది అనుకుంటున్న తరుణంలో ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది.
ఆ రోజు ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్ మ్యాచ్‌లో హెడ్, విరాట్ మధ్య జరిగిన గొడవ తర్వాత తాను మళ్లీ ఆన్లైన్లో వేధింపులను ఎదుర్కొంటున్నట్లు హెడ్ భార్య జెస్సికా ఆస్ట్రేలియన్ మీడియాకు వెల్లడించారు. కోహ్లీతో మైదానంలో హెడ్ వాగ్వాదానికి దిగిన తర్వాత, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో తనను మరోసారి దూషించే సందేశాలు, ట్రోలింగ్‌తో లక్ష్యంగా చేసుకున్నారని జెస్సికా ఆవేదన వ్యక్తం చేశారు. తాను పరిస్థితులను సర్దుబాటు చేసుకున్నప్పటికి ‘వారు నా స్నేహితులు, కుటుంబ సభ్యులను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో వేదిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసిది. ఈ పరిస్థితి తనకు, తన కుటుంబానికి చాలా ఇబ్బంది కరంగా ఉందని జెస్పికా తెలిపారు.
ఇది క్రీడా స్ఫూర్తి కాదు..
2023 ప్రపంచ కప్ తర్వాత జరిగిన వేధింపులు మళ్లీ పునరావృతమైనట్లు అనిపిస్తోంది. నేను నిద్రలేచేసరికి సోషల్ మీడియాలో అసభ్యకరమైన మెసేజ్‌లు వెల్లువెత్తుతున్నాయన్నారు. ఇది మొదటిసారి కాదని, గతంలోనూ ఇలాంటి చేదు అనుభవాలు ఎదురయ్యాయని జెస్సికా గుర్తుచేశారు. 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్, 2024 బాక్సింగ్ డే టెస్టులో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓడిపోయిన ప్రతిసారీ తమకు ఇలాంటి బెదిరింపులు వచ్చాయని తెలిపారు. క్రీడల్లో భావోద్వేగాలు ఉండటం సహజమేనని, అయితే అది శృతి మించకూడదన్నారు. క్రీడలు స్నేహ సంబంధాలను పెంచేవిగా ఉండేలా తప్ప దిగజార్చేవి ఉండ కూడదని హితవు పలికారు. క్రీడాకారులకు కూడా కుటుంబాలు ఉంటాయని గుర్తుంచుకోవాన్నారు. క్రీడాకారుల ఫ్యామిలీ కూడా మనుషులే. ఆట ముగిసిన తర్వాత పరస్పరం గౌరవించుకోవాలి.. ఇలా ప్రవర్తించడం సరికాదు’ అని జెస్సిక ఆవేదన వ్యక్తం చేశారు.
కోహ్లీ-హెడ్ మధ్య ఏం జరిగిందంటే..
ఉప్పల్ వేదికగా ఆర్సీబీ-ఎస్ఆర్హెచ్ జట్లు చివరి లీగ్ మ్యాచ్‌ను ఆడేశాయి. శివాంగ్ కుమార్ వేసిన తొలి ఓవర్లో వెంకటేష్ అయ్యర్ దూకుడుగా ఆడుతూ, సునాయాసంగా బౌండరీలు బాదుతుండగా ఈ ఘర్షణ చోటుచేసుకుంది. ఆ దాడి మధ్యలో, మిడ్-వికెట్లో ఉన్న ట్రావిస్ హెడ్‌ను బౌలింగ్ బాధ్యతలు స్వీకరించమని ఆహ్వానిస్తున్నట్లుగా కోహ్లీ సైగలు చేశాడు. ఈ మధ్యలోనే విరాట్, హెడ్ల మధ్య వాగ్వాదం జరిగింది. ‘భారీ షాట్లు కొట్టు..’ అంటూ కోహ్లీని రెచ్చగొట్టేలా హెడ్ వ్యాఖ్యలు చేయడంతో ఈ వివాదం మొదలైంది.
కోహ్లీ కూడా ఘాటుగా స్పందిస్తూ.. ‘నువ్వు వచ్చి ఆఫ్ స్పిన్ వేయ్.. అప్పుడు భారీ షాట్లు కొడతా. అయినా నువ్వు ఎప్పుడూ ఇంపాక్ట్ ప్లేయర్‌గానే వస్తావు కదా’ అంటూ ఫైరయ్యాడు. ఆ తర్వాత కరచాలనం చేస్తున్నప్పుడు విరాట్.. హెడ్‌కు షేక్‌హ్యాండ్ ఇవ్వలేదు. కోహ్లీ, పాట్ కమిన్స్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ వంటి ఆటగాళ్లను ఆప్యాయంగా పలకరించినప్పటికీ, హెడ్‌ను మాత్రం పట్టించుకోనట్లుగా ప్రవర్తించడంతో ఆన్లైన్లో చర్చనీయాంశంగా మారింది. కాగా, భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కోహ్లీని చర్యను సమర్థించాడు. భావోద్వేగాలు తీవ్రంగా ఉండే కీలకమైన మ్యాచ్‌లలో ఇలాంటి వాడివేడి వాగ్వాదాలు సర్వసాధారణమని అన్నారు.