సిడ్నీ: ఐపీఎల్ స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, ట్రావిస్ హెడ్ హ్యాండ్‌షేక్ వివాదం చిలికిచిలికి గాలివానలా మారుతున్నది. ఉప్పల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన పోరులో హెడ్‌తో వాగ్వాదానికి దిగిన విరాట్ ఆట ముగిశాక అతనితోకరచాలనం చేయకపోవడం చర్చనీయాంశమైంది. ఈ ఘటన తర్వాత హెడ్‌తో పాటు అతని భార్య జెస్సికాను లక్ష్యంగా చేసుకుంటూ కోహ్లీ అభిమానులు సోషల్‌మీడియాలో రచ్చకు దిగారు.
ముఖ్యంగా జెస్సికాపై అసభ్యకర సందేశాలతో రెచ్చిపోయారు. ‘ఉదయం లేవగానే నాపై సోషల్‌మీడియాలో బాంబింగ్ మొదలైంది. అసభ్యకర మెస్సెజ్‌లతో అభిమానులు విపరీతంగా ట్రోల్ చేశారు. మా వరకైతే ఓకే కానీ.. వాళ్లు మా స్నేహితులతో పాటు కుటుంబసభ్యులను లక్ష్యంగా చేసుకోవడం బాధ కలిగించింది. 2023 వన్డే ప్రపంచకప్ తర్వాత మరోమారు ఇలాంటి దాడి ఎదుర్కొవాల్సి వచ్చింది’ అని జెస్సికా ఆవేదన వ్యక్తం చేసింది.