ఆస్ట్రేలియాలో ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్‌కప్-2022 ట్రోఫీని ఇంగ్లండ్ జట్టు ఎగరేసుకుపోయింది. ఈ నెల 13న ఇంగ్లండ్, పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లిష్ టీమ్‌నే విజయం వరించింది. ఈ టోర్నీలో రోహిత్ సారథ్యంలోని భారత జట్టు సెమీస్‌లో ఓటమితో ఇంటి ముఖం పట్టింది. అయితే, టోర్నీ ఆసాంతం కొందరు బ్యాటర్లు పరుగుల వరద పారించారు. అద్భుతమైన ప్రదర్శనతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. ఈ నేపథ్యంలో టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో తొలి ఐదు స్థానాల్లో నిలిచిన వారి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
విరాట్ కోహ్లీ – 296 పరుగులు
భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 98.66 సగటుతో 296 పరుగులు చేసి టోర్నీలో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అందులో నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. సూపర్-12లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ కేవలం 53 బంతుల్లోనే 82 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ టోర్నీలో ఇది కోహ్లీ స్పెషల్ ఇన్సింగ్స్గా చెప్పుకోవచ్చు.
మాక్స్ ఓ డౌడ్ – 242 పరుగులు
ఈ టోర్నీలో నెదర్లాండ్స్ బ్యాటర్ మాక్స్ ఓ డౌడ్ మంచి బ్యాటింగ్ ప్రదర్శన చేశాడు. టోర్నీలో నెదర్లాండ్స్ జట్టు సూపర్-12కు చేరడంలో ఓ డౌడ్ బ్యాటింగ్ ప్రదర్శన కీలకపాత్ర పోషించిందనడంలో ఎలాంటి సందేహం లేదు. టోర్నీ మొత్తంలో 242 పరుగులు చేసిన ఓ డౌడ్.. జాబితాలో విరాట్ కోహ్లీ తర్వాత రెండో స్థానంలో నిలిచాడు. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఓ డౌడ్ 53 బంతుల్లో 71 పరుగులు చేశాడు. ఈ టోర్నీలో అదే అతని అత్యుత్తమ స్కోరు.
సూర్యకుమార్ యాదవ్ – 239 పరుగులు
భారత మిడిల్ ఆర్డర్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ తన బ్యాటింగ్ స్టైల్‌తో క్రికెట్ ప్రియుల మదిని దోచుకున్నాడు. 189.68 స్ట్రైక్ రేటు, 59.75 సగటుతో టోర్నీలో మొత్తం 239 పరుగులు రాబట్టి జాబితాలో టాప్ స్కోరర్స్ జాబితాలో మూడో స్థానం సాధించాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో కేవలం 40 బంతుల్లోనే 68 పరుగులు చేసి తన సత్తా చాటాడు. ఈ టోర్నీలో సూర్యకుమార్ బెస్ట్ స్కోర్ ఇదే.
జాస్ బట్లర్ – 225 పరుగులు
ఇంగ్లండ్ స్కిప్పర్ జాస్ బట్లర్ తడబడుతూ టోర్నీని మొదలుపెట్టినా.. సరిగ్గా అవసరమైన సమయంలో ఫామ్‌ను అందిపుచ్చుకున్నాడు. పరుగుల వరద పారించి 225 పరుగులను తన ఖాతాలో వేసుకున్నాడు. టోర్నీలో అత్యధిక పరుగులు సాధించిన నాలుగో ఆటగాడిగా నిలిచాడు. సూపర్-12లో న్యూజిలాండ్‌తో జరిగిన 47 బంతుల్లో 73 పరుగులు చేశాడు. సెమీఫైనల్లో భారత్‌పై కేవలం 49 బంతుల్లోనే 80 పరుగులు చేసి.. రోహిత్ సేన ఫైనల్ ఆశలపై నీళ్లు చల్లాడు. పాకిస్థాన్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో కూడా బట్లర్ కీలకపాత్ర పోషించాడు.
కుశాల్ మెండిస్ – 223 పరుగులు
శ్రీలంక జట్టు సూపర్-12కు అర్హత సాధించడంలో ఆ జట్టు టాప్ ఆర్డర్ బ్యాటర్ కుశాల్ మెండిస్ అత్యంత ముఖ్య పాత్ర పోషించాడు. 140 స్ట్రైక్ రేటు, 31.85 సగటుతో టోర్నీ మొత్తంలో 223 పరుగులు పిండుకున్నాడు. తొలి రౌండ్లో నెదర్లాండ్స్‌పై చేసిన హాఫ్ సెంచరీ, సూపర్ 12లో ఐర్లాండ్‌పై చేసిన హాఫ్ సెంచరీ మ్యాచ్ విన్నింగ్ అర్ధసెంచరీలుగా నిలిచాయి.