Karan Nair | నాగ్‌పూర్: దేశవాళీల్లో విదర్భ స్టార్ బ్యాటర్ కరణ్నాయర్ పరుగుల వరద దిగ్విజయంగా కొనసాగుతున్నది. తన కెరీర్లో అద్భుత ఫామ్ కనబరుస్తున్న నాయర్ శనివారం తమిళనాడుతో మొదలైన క్వార్టర్స్ పోరులో నాయర్(180 బంతుల్లో 100 నాటౌట్, 14ఫోర్లు, సిక్స్) అజేయ సెంచరీతో కదంతొక్కాడు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన విదర్భ ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. విజయ్ శంకర్(2/50) ధాటికి విదర్భ 44 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ అథర్వ తదై(0) డకౌట్ కాగా, ఆదిత్య తకారె(5), దృవ్ షోరె(26) విఫలమయ్యారు. ఈ తరుణంలో దనీశ్ మలెవార్(75), కరణ్నాయర్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. ముఖ్యంగా ఈ సీజన్లో జట్టు బ్యాటింగ్ భారాన్ని మోస్తున్న నాయర్ తన ఇన్నింగ్స్‌లో 14ఫోర్లు, సిక్స్‌తో అలరించాడు. గాడిలో పడిందనుకున్న తరుణంలో మలెవార్ ఔట్ కావడంతో నాలుగో వికెట్‌కు 98 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన అక్షయ్ వాడ్కర్(24)తో కలిసి నాయర్ ఇన్నింగ్ బాధ్యత తీసుకున్నాడు. సోనూ యాదవ్, మహమ్మద్, అజిత్రామ్, అలీ ఒక్కో వికెట్ తీశారు.
ఆదుకున్న ములానీ, తనుశ్:
ముంబై, హర్యానా రంజీ క్వార్టర్స్ పోరు రసవత్తరంగా సాగుతున్నది. అన్శుల్ కాంబోజ్(3/58), సుమిత్‌కుమార్(2/57) ధాటికి 65 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన ముంబైని శామ్స్ ములానీ(91), తనుశ్ కొటియాన్(85 నాటౌట్) ఆదుకున్నారు.