క్రైస్ట్‌చర్చ్: మహిళల వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్‌కు చేరాలంటే తప్పక నెగ్గాల్సిన స్థితిలో భారత జట్టు చివరి లీగ్ మ్యాచ్‌కు సిద్ధమైంది. ఆదివారం దక్షిణాఫ్రికాతో జరుగనున్న మ్యాచ్‌లో గెలిస్తేనే మిథాలీ బృందం నాకౌట్‌కు అర్హత సాధించనుంది. ఇప్పటి వరకు లీగ్ దశలో ఆరు మ్యాచ్‌లాడి మూడింట నెగ్గిన టీమ్ఇండియా ఆరు పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా (14 పాయింట్లు), దక్షిణాఫ్రికా (9 పాయింట్లు) ఇప్పటికే సెమీస్ బెర్త్‌లు ఖరారు చేసుకోగా.. మరో రెండు స్థానాల కోసం వెస్టిండీస్, ఇంగ్లండ్, భారత్ మధ్య పోటీ కొనసాగుతున్నది. మెగాటోర్నీలో నిలకడైన ప్రదర్శన కనబర్చలేకపోతున్న టీమ్ఇండియా ఆఖరి పోరులో కలిసి కట్టుగా విజృంభించాలని భావిస్తున్నది. బ్యాటింగ్‌లో మిథాలీరాజ్ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయాల్సిన అవసరం ఉంది. ఆమెతో పాటు స్మృతి మందన, షఫాలీ వర్మ, యస్తిక భాటియా, హర్మన్‌ప్రీత్ కౌర్, దీప్తి శర్మ సమిష్టిగా సత్తాచాటితే భారత్‌కు తిరుగుండదు. బౌలింగ్‌లో వెటరన్ జులన్ గోస్వామితో పాటు పూజ వస్ర్తాకర్, రాజేశ్వరి గైక్వాడ్, పూనమ్‌పై తీవ్ర ఒత్తిడి ఉంది.