దాదాపు నెల రోజులుగా అభిమానులను అలరిస్తున్న టీ20 ప్రపంచకప్ చివరి అంకానికి చేరుకుంది. ఐసీసీ ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్ ఫైనల్లో ఆదివారం ఇంగ్లండ్‌తో పాకిస్థాన్ తలపడనుంది. ఆరంభంలో తడబడినా తర్వాత పుంజుకుని పాక్ ముందంజ వేస్తే.. సెమీస్‌లో టీమ్ఇండియాపై ఘన విజయంతో ఇంగ్లండ్ ఫైనల్‌కు చేరుకుంది. బలాబలాల పరంగా చూసుకుంటే ఇరు జట్లు సమ ఉజ్జీలుగా కనిపిస్తున్నా.. బంతుల వ్యవధిలో ఫలితం మారిపోయే పొట్టి ఫార్మాట్లో విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి!
మెల్బోర్న్: నెల రోజుల ముందు ఎవరూ ఊహించని రెండు జట్ల మధ్య టీ20 వరల్డ్‌కప్ ఫైనల్‌కు రంగం సిద్ధమైంది. ప్రపంచంలోనే అతిపెద్ద మైదానాల్లో ఒకటైన మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)లో ఆదివారం ఇంగ్లండ్, పాకిస్థాన్ మధ్య తుదిపోరు జరుగనుంది. టోర్నీ ఆరంభ మ్యాచ్‌ల్లో భారత్, జింబాబ్వే చేతిలో ఓడి ఇంటిబాట పట్టేలా కనిపించిన పాకిస్థాన్.. ఆ తర్వాత స్ఫూర్తిదాయక ఆటతీరుతో ఫైనల్ చేరగా.. ఐర్లాండ్ చేతిలో ఓడిన ఇంగ్లండ్ ఆనక విజృంభించి తుది పోరుకు అర్హత సాధించింది. ఇరు జట్లు గతంలో ఒక్కోసారి పొట్టి ప్రపంచకప్‌ను ముద్దాడగా.. రెండో టైటిల్ కోసం అమీతుమీ తేల్చుకోనున్నాయి. కాగితంపై చూస్తే ఇరు జట్లు సమంగానే కనిపిస్తున్నా.. బ్యాటింగ్‌లో ఇంగ్లండ్, బౌలింగ్‌లో పాకిస్థాన్ మెరుగ్గా ఉన్నాయి.
షాహీన్ షా అఫ్రిది, మహమ్మద్ వసీమ్, హరీస్ రవూఫ్, నసీమ్ షాతో కూడిన పాక్ పేస్ దళంతో ఇంగ్లండ్‌కు ఇక్కట్లు తప్పకపోవచ్చు. మరోవైపు పదో స్థానం వరకు బ్యాటింగ్ చేయగల వాళ్లు ఉండటం ఇంగ్లండ్‌కు కలిసి రానుంది. కెప్టెన్ జోస్ బట్లర్, ఓపెనర్ అలెక్స్ హేల్స్.. టీమ్ఇండియాపై ఆడిన ఇన్నింగ్స్‌ను ఇప్పట్లో అభిమానులు మరిచిపోలేరు. ఈ ఇద్దరితో పాటు మలన్, స్టోక్స్, బ్రూక్, లివింగ్‌స్టోన్, మోయిన్ అలీ, సామ్ కరన్, క్రిస్ వోక్స్ రూపంలో ఇంగ్లండ్ జట్టు హిట్టర్లతో నిండి ఉంది.
స్టోక్స్, మోయిన్ అలీ, లివింగ్‌స్టోన్, వోక్స్ రూపంలో నలుగురు ఆల్‌రౌండర్లు అందుబాటులో ఉండటం ఇంగ్లండ్‌కు అదనపు బలం కానుంది. భారత్‌తో పోరులో రషీద్, లివింగ్‌స్టోన్ స్లో బంతులతో ఫలితం రాబట్టిన విషయం తెలిసిందే. మరోవైపు పాకిస్థాన్ ఓపెనర్లపైనే ఎక్కువ ఆధారపడుతున్నది. కెప్టెన్ బాబర్ ఆజమ్, మహమ్మద్ రిజ్వాన్ రాణించడంపైనే ఆ జట్టు విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. సెమీస్‌లో న్యూజిలాండ్‌పై చక్కటి ఇన్నింగ్స్‌లు ఆడిన వీరిద్దరి నుంచి మేనేజ్మెంట్ అలాంటి ప్రదర్శనే ఆశిస్తున్నది.
పిచ్, వాతావరణం
మెల్బోర్న్ పిచ్ పేస్, బౌన్స్‌కు సహకరించనుంది. కుదురుకుంటే మంచి స్కోరు సాధ్యమే. మైదానం పెద్దది. మ్యాచ్ రోజు వర్ష సూచన ఉంది. తుది పోరుకు రిజర్వ్ డే ఉంది.