T20 World Cup | దుబాయ్: ప్రతిష్ఠాత్మక మహిళల టీ20 ప్రపంచకప్ టోర్నీలో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. ఏండ్లుగా ఊరిస్తూ వస్తున్న ప్రపంచకప్ టోర్నీని ఎలాగైనా ముద్దాడాలన్న పట్టుదలతో ఉన్న దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ ఆదివారం టైటిల్ పోరులో అమీతుమీ తేల్చుకోనున్నాయి. అనూహ్య విజయాలతో మెగాటోర్నీ ఫైనల్లో నిలిచిన దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌లో ఎవరూ గెలిచినా కొత్త చరిత్ర కానుంది. 2009లో మొదలైన టీ20 ప్రపంచకప్‌లో ఇప్పటి వరకు ఆస్ట్రేలియా అత్యధికంగా ఆరుసార్లు చాంపియన్‌గా నిలిస్తే..ఇంగ్లండ్, వెస్టిండీస్ ఒక్కోసారి టైటిల్‌ను సొంతం చేసుకున్నాయి.
సెమీస్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాను మట్టికరిపించిన సఫారీలు మంచి జోష్మీదుంటే..మరో సెమీస్‌లో కరీబియన్లను ఓడించిన కివీస్..తొలిసారి టైటిల్ ఒడిసిపట్టుకోవాలని చూస్తున్నది. టోర్నీకి ముందు వరుసగా 10 మ్యాచ్‌ల్లో ఓడిన కివీస్..అంచనాలను తలక్రిందులు చేస్తూ సోఫీ డివైన్ కెప్టెన్సీలో వరుస విజయాలతో కదంతొక్కింది. డివైన్‌కు తోడు సుజీబేట్స్, అమెలియా కెర్ రాణిస్తే..కివీస్‌కు తిరుగుండకపోవచ్చు. దక్షిణాఫ్రికా తరఫున వోల్వార్డ్(190), తంజిమ్ బ్రిట్స్(170) టాప్స్కోరర్లుగా కొనసాగుతున్నారు. జట్టు మరోమారు సమిష్టి ప్రదర్శన కనబరిస్తే..సఫారీల కప్ కల నెరవేరినట్లే.