ఆసియాకప్‌లో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్..దుబాయ్‌లో ముఖాముఖి తలపడబోతున్నాయి. పహల్గాం ఉగ్రదాడి తర్వాత దాయాది దేశాలు తొలిసారి తలపడబోతున్న మ్యాచ్‌పై అభిమానుల్లో ఆసక్తి నెలకొన్నది. ఓవైపు బాయ్‌కాట్ అంటూ సోషల్‌మీడియాలో పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న నిరసన భారత్, పాక్ పోరుకు మరింత హీట్ పుట్టిస్తున్నది. అన్ని విభాగాల్లో పాక్ కంటే ఆధిపత్యంలో కనిపిస్తున్న సూర్యకుమార్ నేతృత్వంలోని టీమ్ఇండియా మంచి జోష్‌మీద ఉంది. అన్నింటా అగ్రగామిగా కనిపిస్తున్న భారత్‌కు పాక్ దీటైన పోటీనిస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది.
దుబాయ్: క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. భారత్, పాకిస్థాన్ జట్లు ఆసియాకప్‌లో ఆదివారం అమీతుమీ తేల్చుకోబోతున్నాయి. గ్రూపు-ఏ లీగ్ పోరులో భాగంగా చిరకాల ప్రత్యర్థులు సై అంటే సై అంటున్నాయి. ఇప్పటికే ఎనిమిది సార్లు ఆసియాకప్‌ను దక్కించుకున్న టీమ్ఇండియా రికార్డు స్థాయిలో తొమ్మిదో సారి కన్నేస్తే.. కనీసం పోటీ ఇచ్చేందుకు పాక్ పట్టుదలతో ఉంది. ఓవైపు దిగ్గజ ద్వయం రోహిత్‌శర్మ, విరాట్‌కోహ్లీ రిటైర్మెంట్ తర్వాత తొలిసారి భారత్ బరిలోకి దిగుతుండగా, మరోవైపు బాబర్ ఆజమ్, రిజ్వాన్ లేకుండా పాక్ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రయత్నిస్తున్నది. రోకో వారసత్వాన్ని పుణికి పుచ్చుకునేందుకు యంగ్ ఇండియా అడుగులు వేస్తున్నది. శుభ్‌మన్ గిల్, అభిషేక్‌శర్మ రూపంలో టీమ్ఇండియా అదిరిపోయే ఓపెనింగ్ జోడీ దొరకగా, తిలక్‌వర్మ, శాంసన్, సూర్యకుమార్, హార్దిక్, శివమ్ దూబే, బుమ్రా, కుల్దీప్ లాంటి క్రికెటర్లతో భారత్ పటిష్టంగా కనిపిస్తున్నది.
ఆసియాకప్‌ను మరోమారు తమ ఖాతాలో వేసుకోవాలన్న ఏకైక లక్ష్యంతో అరబ్ గడ్డపై అడుగుపెట్టిన టీమ్ఇండియా మెండైన ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నది. తొలి మ్యాచ్‌లో యూఏఈని 60 పరుగుల లోపే కట్టడి చేసిన టీమ్ఇండియా బ్యాటింగ్‌లో ఐదు ఓవర్లలోపే మ్యాచ్‌ను ముగించి తమ ఉద్దేశమేంటో చెప్పకనే చెప్పింది. దూకుడైన బ్యాటింగ్‌కు పెట్టింది పేరైన టీమ్ఇండియాకు పాకిస్థాన్ దీటైన పోటీని ఇవ్వగలుతుందా అన్నది ఆలోచింపజేస్తున్నది. యూఏఈతో పోరులో ఓవైపు చైనామన్ స్పిన్నర్ కుల్దీప్యాదవ్ మాయాజాలం చేస్తే యార్కర్ కింగ్ బుమ్రా తనదైన శైలిలో వికెట్ల వేట కొనసాగించాడు. షాహిన్షా అఫ్రిదీ మినహాయిస్తే పెద్దగా చెప్పుకోదగ్గ బౌలర్ లేని పాక్..టీమ్ఇండియా ఏ మేరకు నిలువరిస్తుందనేది చూడాలి. ఇదిలా ఉంటే సల్మాన్ అలీ అగా కెప్టెన్సీలో ఇప్పుడిప్పుడే గాడిలో పడుతున్న పాక్‌కు సయిమ్ ఆయూబ్, హరిస్ కీలకంగా మారారు.
బాయ్‌కాట్ మ్యాచ్
పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది అమాయకులు చనిపోయిన తర్వాత ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పహల్గాం దాడికి ప్రతీకారంగా భారత్ జరిపిన ఆపరేషన్ సిందూర్‌లో పాక్ ఎయిర్‌బేస్‌లు పూర్తిగా దెబ్బతిన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉగ్రదాడికి నిరసనగా పాక్‌తో భారత్ మ్యాచ్ ఆడవద్దంటూ ఓవైపు సోషల్‌మీడియాలో బాయ్‌కాట్ నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఉగ్రదాడిలో మరణించిన కుటుంబాలు పాక్‌తో ఆడవద్దంటూ తమ నిరసన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అయితే ఐసీసీ మల్టీ నేషన్ ఈవెంట్ కావడంతో కేంద్ర ప్రభుత్వ అనుమతితో భారత్ పోటీకి దిగింది. దీనిపై దాదాపు అన్ని వైపుల నుంచి తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి.