హైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణ టీ20 లీగ్‌లో టీమిండియా టీ20 వైస్ కెప్టెన్ తిలక్ వర్మ (2/29; 56 బంతుల్లో 14 ఫోర్లు, 8 సిక్సర్లతో 136 నాటౌట్) తడాఖా చూపెట్టాడు. బిజీ ఇంటర్నేషనల్ షెడ్యూల్ మధ్య బరిలోకి దిగి ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అభిమానులను అలరించాడు. మెదక్ ఫాల్కన్స్ కెప్టెన్‌గా ఉప్పల్ స్టేడియంలోకి వచ్చిన అతను బంతితో 2 వికెట్లు తీసిన తర్వాత బ్యాట్‌తో మరింత కనువిందు చేశాడు. ఫోర్లు, సిక్సర్ల మోత మోగిస్తూ అద్భుత శతకంతో అదరగొట్టిన తిలక్ తన జట్టును గెలిపించాడు. దాంతో సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో మెదక్ 3 వికెట్ల తేడాతో వరంగల్ వారియన్స్పై గెలిచింది. ప్రత్యర్థి ఇచ్చిన 259 పరుగుల లక్ష్యాన్ని మెదక్ 19.4 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన తిలక్.. మరో ఎండ్‌లో వరుసగా వికెట్లు పడుతున్నా తన ట్రేడ్‌మార్క్ షాట్లతో బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 77 రన్స్ వద్ద క్యాచ్ డ్రాప్ అవడంతో దక్కిన చాన్స్‌ను సద్వినియోగం చేసుకుంటూ 42 బంతుల్లో శతకం పూర్తి చేసుకోవడం పాటు జట్టును గెలిపించాడు. తొలుత కెప్టెన్ పేరాల అమన్ రావు (42 బంతుల్లో 16 ఫోర్లు, 4 సిక్సర్లతో 142) 32 బంతుల్లో సెంచరీతో విజృంభించడంతో వరంగల్ 20 ఓవర్లలో 258/7 స్కోరు చేసింది. అంతకుముందు జరిగిన మ్యాచ్ లో రంగారెడ్డి రైజర్స్ 5 వికెట్ల తేడాతో నల్లగొండ నైట్స్‌పై గెలుపొందింది.
ఉదయం లంకలో.. సాయంత్రం ఉప్పల్‌లో
బిజీ షెడ్యూల్లోనూ టీజీ20 లీగ్‌లో బరిలోకి దిగిన తిలక్ ఆటపై, సొంతగడ్డపై ప్రేమను చాటుకున్నాడు. శ్రీలంకలో ఆదివారం ముగిసిన ముక్కోణపు వన్డే సిరీస్‌లో కెప్టెన్‌గా భారత్-ఏకు ట్రోఫీ అందించిన తిలక్ సోమవారం ఉదయమే హైదరాబాద్ చేరుకున్నాడు. విశ్రాంతి తీసుకోకుండా స్టేడియానికి వచ్చిన మెదక్ ఫాల్కన్స్‌ను నడిపించాడు. సెంచరీ ముంగిట కాలి కండరాలు పట్టేయడంతో ఇబ్బందిపడినా.. పోరాటం ఆపకుండా ఆడి జట్టును గెలిపించాడు. కాగా, మంగళవారం తను భారత టీ20 జట్టుతో కలిసి ఐర్లాండ్ టూర్‌కు బయల్దేరుతాడు. ఈ సిరీస్ తర్వాత ఇంగ్లండ్‌తో జూలై 11 వరకు జరిగే ఐదు టీ20 సిరీస్‌లో పాల్గొంటాడు. దాంతో ఈ లీగ్‌లో తిలక్ మళ్లీ బరిలోకి దిగే చాన్స్ లేదు.