Tilak Varma : భారత యువ సంచలనం తిలక్ వర్మ(Tilak Varma) అరంగేట్రం సిరీస్‌లోనే అద్భుతః అనిపించాడు. వెస్టిండీస్(West Indies)తో జరిగిన ఐదు టీ20ల సిరీస్‌లో దంచి కొట్టిన ఈ తెలుగు కుర్రాడు సరికొత్త రికార్డు నెలకొల్పాడు. 20 ఏళ్లు లేదా అంతకంటే తక్కువ వయసులో అత్యధిక సిక్స్‌లు(Most Sixes) బాదిన భారత క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. అవును.. తిలక్ ఇప్పటికే ఏడు సిక్స్‌లు కొట్టాడు. దాంతో, గతంలో రోహిత్ శర్మ(Rohit Sharma) 4 సిక్స్‌లతో నెలకొల్పిన రికార్డు బద్ధలు కొట్టాడు.
ఐపీఎల్ 16వ సీజన్లో ముంబై ఇండియన్స్(Mumbai Indians) తరఫున మెరుపు ఇన్నింగ్స్‌లతో తిలక్ వర్మ జాతీయ జట్టులోకి వచ్చాడు. వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌లో అందివచ్చిన అవకాశాన్ని రెండు చేతులా ఒడిసిపట్టుకున్నాడు. మొదటి మ్యాచ్‌లో 32, రెండో టీ20లో 52 పరుగులతో రాణించాడు.
తిలక్ వర్మ

కీలకమైన మూడో మ్యాచ్‌లో 49 నాటౌట్, నాలుగో మ్యాచ్‌లో 7 నాటౌట్‌గా నిలిచి జట్టును గెలిపించాడు. ఇక సిరీస్ డిసైడర్ అయిన ఐదో మ్యాచ్‌లో 27 పరుగులతో ఆకట్టుకున్నాడు. కానీ, వెస్టిండీస్ 8 వికెట్లతో విజయం సాధించి ట్రోఫీ దక్కించుకుంది. దాంతో, భారత్‌పై 17 ఏళ్ల తర్వాత మొదటి సిరీస్ అందుకుంది.
తిలక్ వర్మ ఆట చూసిన మాజీ ఆటగాళ్లు అతడు వరల్డ్ కప్ జట్టులో ఉండాలని కోరుకుంటున్నారు. నాలుగో స్థానంలో ఈ యంగ్‌స్టర్‌ను ఆడిస్తే మంచిదని, మిడిల్ ఓవర్లలో అతను కీలకం అవుతాడని మాజీ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్(MSK Prasad) సైతం అభిప్రాయ పడ్డాడు. ఎడమ చేతివాటం బ్యాటర్ అయిన తిలక్ పరిస్థితులకు తగ్గట్టు ఆడడంలో దిట్ట. అందుకని అతడు టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్లో చక్కగా సరిపోతాడని విశ్లేషకులు అంటున్నారు. ఈ ఏడాది అక్టోబర్ 5న భారత్‌లో ప్రపంచ కప్ మొదలవ్వనున్న విషయం తెలిసిందే.