ఢిల్లీ: భారత క్రీడా చరిత్రలో ఘనమైన వారసత్వం కల్గిన హాకీలో ఈ ఏడాది పురుషులు, మహిళల జట్లకు మిశ్రమ ఫలితాలు దక్కాయి. పురుషుల జట్టు పడుతూ లేస్తూ కొన్ని అద్భుత విజయాలు తమ ఖాతాలో వేసుకున్నా మహిళల జట్టు మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. ఈ ఏడాది మెన్స్ టీమ్.. స్వదేశంలోనే జరిగిన ఆసియా కప్‌ను కైవసం చేసుకుని సుమారు దశాబ్దపు నిరీక్షణకు తెరదించగా మహిళల జట్టు సైతం రజతం నెగ్గింది. హర్మన్‌ప్రీత్ సింగ్ సారథ్యంలోని సీనియర్ భారత జట్టుతో పాటు పురుషుల విభాగంలో జూనియర్ జట్టు కూడా అంచనాలకు మించి రాణించింది.
8 ఏండ్ల నిరీక్షణకు తెర
ఈ ఏడాది భారత జట్టు సాధించిన గొప్ప విజయాల్లో ఒకటి ఆసియా కప్ టైటిల్. ఆగస్టు 14-30 మధ్య బీహార్‌లోని రాజ్‌గిర్‌లో జరిగిన ఈ టోర్నీ ఆసాంతం భారత జట్టు సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించింది. ముఖ్యంగా ఫైనల్లో మాజీ చాంపియన్స్ దక్షిణకొరియాను 4-1తో చిత్తుచేసి టైటిల్ కైవసం చేసుకుంది. తద్వారా 8 ఏండ్ల నిరీక్షణకు హర్మన్‌ప్రీత్ సింగ్ సేన తెరదించింది. ఈ విజయంతో భారత జట్టు వచ్చే ఏడాది నెదర్లాండ్స్‌లో జరుగబోయే ఎఫ్ఐహెచ్ వరల్డ్ కప్‌లోనూ బెర్తును ఖాయం చేసుకుంది. ఇక ప్రధాన ఆటగాళ్లు లేకున్నా ఈ ఏడాది నవంబర్‌లో జరిగిన సుల్తాన్ ఆజ్లాన్ షా కప్‌లోనూ భారత్ రజతం గెలిచి సత్తాచాటింది. హర్మన్‌ప్రీత్, మన్‌ప్రీత్ సింగ్ వంటి స్టార్ ఆటగాళ్ల గైర్హాజరీలో భారత్ రెండో స్థానంతో ముగించడం గమనార్హం. అయితే ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్‌లో మాత్రం భారత ప్రదర్శన దారుణంగా ఉంది. 9 జట్లు ఆడిన ఆ టోర్నీలో భారత్.. 8వ స్థానంతో ముగించడం గమనార్హం. భువనేశ్వర్‌లో జరిగిన మ్యాచ్‌లలోనూ భారత్‌కు భంగపాటు తప్పలేదు.
జూనియర్లు సూపర్
సీనియర్ జట్టుతో పాటు జూనియర్ (పురుషుల) టీమ్ కూడా ఈ ఏడాది అంచనాలకు మించి రాణించింది. డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ పీఆర్ శ్రీజేశ్ మార్గనిర్దేశనంలో యువ భారత్.. ఇటీవలే చెన్నై వేదికగా ముగిసిన జూనియర్ హాకీ ప్రపంచకప్‌లో కాంస్యం గెలిచింది. 2016 తర్వాత ఈ టోర్నీలో భారత్‌కు ఇదే మొదటి పతకం. ఆ టోర్నీ ఆసాంతం రాణించిన భారత్.. కీలకమైన సెమీస్‌లో పటిష్ట జర్మనీ చేతిలో ఓడినా కాంస్య పోరులో మరో మెరుగైన జైట్టెన అర్జెంటీనాను చిత్తుచేసి పతకం నెగ్గింది. ఈ ఏడాది అక్టోబర్‌లో జరిగిన సుల్తాన్ ఆఫ్ జొహొర్ కప్‌లోనూ జూనియర్ జట్టు మెరుగ్గా ఆడి రజతం గెలుచుకోవడం విశేషం.
అమ్మాయిలకు నిరాశ
పురుషుల జట్లు మిశ్రమ ఫలితాలు సాధిస్తే మహిళల జట్లు మాత్రం దారుణంగా నిరాశపరిచాయి. ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్‌లో 11 మ్యాచ్‌లకు గాను రెండింట్లోనే గెలిచిన భారత్.. 8 మ్యాచ్‌ల్లో ఓడింది. దీనికి తోడు ఆసియా కప్ ఫైనల్లో పరాభవంతో వచ్చే ఏడాది జరగాల్సిన వరల్డ్ కప్‌నకు నేరుగా అర్హత సాధించే అవకాశాన్ని కోల్పోయింది. ఆటగాళ్లు, జట్టు వైఫల్యం చాలదన్నట్టు కొద్దిరోజుల క్రితమే మహిళా హాకీ జట్టు కోచ్ హరీందర్ సింగ్ ఉన్నట్టుండి తన పదవి నుంచి తప్పుకోవడం కొత్త తలనొప్పులను తీసుకొచ్చింది. అమ్మాయిల జూనియర్ జట్టు కూడా ఇటీవల ముగిసిన వరల్డ్ కప్‌లో పదో స్థానంతో ముగించింది.