కరాచీ: పాకిస్థాన్ వేదికగా మరికొన్ని క్షణాల్లో చాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy) ప్రారంభంకానున్నది. ఐసీసీ నిర్వహిస్తున్న ఆ వన్డే టోర్నీలో 8 జట్లు పోటీపడుతున్నాయి. 29 ఏళ్ల తర్వాత మళ్లీ పాక్ వేదికగా ఐసీసీ టోర్నీ జరుగుతోంది. కరాచీ వేదికగా మరికాసేపట్లో పాకిస్థాన్, న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ ప్రారంభంకానున్నది. అయితే ఈ వన్డే టోర్నమెంట్లో అయిదుగురు క్రికెటర్లు కీలకం కానున్నారు. ఆ క్రికెటర్లు ఎవరో తెలుసుకుందాం.
వరుణ్ చక్రవర్తి
భారత స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిపై అందరి కన్ను ఉంది. ఈ టోర్నీలో ఇతను సత్తా చాటే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. భారత బౌలింగ్ లైనప్‌కు వరుణ్ మరింత బలాన్ని ఇచ్చే అవకాశం ఉన్నది. దుబాయ్ స్లో పిచ్ ఇతనికి అనుకూలించే అవకాశాలు ఉన్నాయి. కొన్ని రోజుల క్రితం ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో అతను అరంగేట్రం చేశాడు. ఆ సిరీస్‌లో అతను 14 వికెట్లు తీసుకున్నాడు. గత ఏడాది ఐపీఎల్లో కూడా అతను అద్భుతగా బౌల్ చేశాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున అతను 21 వికెట్లు తీసుకున్నాడు. కోచ్ గౌతం గంభీర్ అతనిపై గంపెడు ఆశలు పెట్టుకున్నాడు.
తయ్యబ్ తాహిర్
పాకిస్థాన్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ తయ్యబ్ తాహిర్ ఈ టోర్నీలో రాణిస్తాడని భావిస్తున్నారు. ఈ మధ్య టాప్ ఫామ్‌లో ఉన్న అతను.. భారీగా పరుగులు చేయగలడన్న విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. 2023 ఎమర్జింగ్ టీమ్స్ ఆసియాకప్ ఫైనల్లో అతను సెంచరీతో చెలరేగాడు. 31 ఏళ్ల తయ్యబ్.. ఇటీవల స్వదేశీ క్రికెట్లో కూడా పరుగుల వరద సృష్టించాడు. గత ఏడాది పాక్ వన్డేల్లో అరంగేట్రం చేశాడు. తయ్యబ్ కీలక ప్లేయర్‌గా ఎదిగే అవకాశాలు ఉన్నట్లు బౌలింగ్ దిగ్గజం వసీం అక్రమ్ పేర్కొన్నాడు. పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో అతను అద్భుతమైన ట్యాలెంట్ ప్రదర్శించినట్లు మెచ్చుకున్నాడు.
టామ్ బాంటన్
బ్యాటర్ టామ్ బాంటన్‌పై ఇంగ్లండ్ ఆశలు పెట్టుకున్నాడు. ఇండియాతో సిరీస్‌లోనే అతను అరంగేట్రం చేశాడు. సిరీస్ చివరి మ్యాచ్‌లో అతను 38 రన్స్ చేశాడు. ఆ 26 ఏళ్ల బ్యాటర్ అహ్మదాబాద్ మ్యాచ్‌లో మూడవ నెంబర్లో ఆడాడు. గాయపడ్డ జాక్ బేతల్ స్థానంలో అతన్ని తీసుకున్నారు. చాంపియన్స్ ట్రోఫీకి కూడా అతన్ని తీసుకున్నారు. ఇండియాతో మ్యాచ్‌లో అతను సుందర్ బౌలింగ్ భారీ సిక్సర్ కొట్టాడు. అయితే టీ20 క్రికెట్లో అతను మంచి ఫామ్‌లో ఉన్నాడు. యూఏఈ ప్రీమియర్ లీగ్‌లో అతను లీడింగ్ రన్ స్కోరర్‌గా ఉన్నాడు. 11 ఇన్నింగ్స్‌లో అతను 493 రన్స్ చేశాడు. దాంట్లో రెండు సెంచరీలు ఉన్నాయి.
ఆరన్ హర్డై
ఆస్ట్రేలియాకు చెందిన 26 ఏళ్ల ఆరన్ హర్డై కూడా స్పెషల్ ఫోకస్‌గా మారాడు. మార్కస్ స్టోయినిస్ సడెన్‌గా రిటైర్మెంట్ ప్రకటించడంతో.. ఆల్‌రౌండర్ పాత్రను ఆరన్ హర్డై పోషించనున్నాడు. రైట్ ఆర్మ్ పేస్ బౌలింగ్ చేయగలడు. బ్యాటింగ్‌లో చాలా పవర్ఫుల్ షాట్స్ ఆడుతాడు. శ్రీలంకతో జరిగిన సిరీస్‌లో అతను రాణించాడు. 2018లో క్రికెట్ ఆస్ట్రేలియా లెవన్, భారత్ మధ్య జరిగిన మ్యాచ్‌లో 86 రన్స్ స్కోర్ చేశాడు. ఆ మ్యాచ్‌లో అతను కోహ్లీ, రోహిత్‌ను ఔట్ చేశాడు. అయితే వన్డేల్లో అతను భారీ ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంది.
విల్ ఓరౌర్కీ
న్యూజిలాండ్ ప్లేయర్ విల్ ఓరౌర్కీ ఎత్తు ఆరు అడుగుల నాలుగు ఇంచులు. ఆ ఫాస్ట్ బౌలర్ ఇప్పటికే 9 వన్డేలు ఆడాడు. ఐసీసీ టోర్నీలో తొలిసారి ఆడనున్నాడు. 23 ఏళ్ల ఆ బౌలర్ 2023లో తొలి వన్డేలో అరంగేట్రం చేశాడు. అయితే గత ఏడాది సౌతాఫ్రికాతో జరిగిన టెస్టులో అతను 9 వికెట్లు తీసి అందరి దృష్టిని ఆకర్షించాడు. తాజాగా పాక్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో 4 వికెట్లు తీసి జట్టుకు విజయాన్ని అందించాడు. బెన్ సియర్స్, లాకీ ఫెర్గూసన్ గాయాలతో తప్పుకోవడంతో.. రౌర్కీకి బౌలింగ్ యూనిట్లో చోటు దక్కింది.