బ్రిస్బేన్ : ఇంగ్లండ్‌తో బ్రిస్బేన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో తొలిరోజు బంతితో మెరిసిన ఆతిథ్య ఆస్ట్రేలియా.. రెండో రోజు బ్యాట్‌తోనూ సత్తాచాటింది. టాపార్డర్ బ్యాటర్లు వన్డే తరహా ఆట ఆడటంతో ఆ జట్టు రెండో రోజు ఆట ముగిసేసరికి ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు కోల్పోయి 378 రన్స్ చేసింది. ఓపెనర్ వెదరాల్డ్ (78 బంతుల్లో 72, 12 ఫోర్లు, 1 సిక్స్), లబూషేన్ (78 బంతుల్లో 65, 9 ఫోర్లు, 1 సిక్స్), తాత్కాలిక సారథి స్టీవ్ స్మిత్ (85 బంతుల్లో 61, 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ శతకాలతో రాణించడంతో ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో ఇప్పటికే 44 పరుగుల ఆధిక్యంలో ఉంది. బ్రైడెన్ కార్స్ (113/3) భారీగా పరుగులిచ్చుకున్నా మూడు కీలక వికెట్లు పడగొట్టాడు.
రెండోరోజు బ్యాటింగ్‌కు వచ్చిన ఇంగ్లండ్.. ఓవర్‌నైట్ స్కోరుకు 9 పరుగులు మాత్రమే జోడించి 334కు ఆలౌట్ అయింది. రెండో టెస్టు ఆడుతున్న వెదరాల్డ్.. అట్కిన్సన్ ఓవర్లో రెండు బౌండరీలతో పరుగుల వేటను మొదలుపెట్టాడు. అతడే వేసిన 8వ ఓవర్లో మూడు బౌండరీలు బాదిన అతడు ఎక్కడా తగ్గలేదు. కార్స్ ఓవర్లో 4,6 బాదిన హెడ్.. అతడే వేసిన 14వ ఓవర్లో ఔట్ అయ్యాడు. హెడ్ ఔటైనా లబూషేన్ అండతో వెదరాల్డ్ ఇంగ్లిష్ పేసర్లపై ఎదురుదాడికి దిగడంతో 17.2 ఓవర్లలోనే కంగారూల స్కోరు వంద దాటింది. టీ విరామానికి 130/1గా ఉన్న ఆసీస్.. ఆ తర్వాత వెదరాల్డ్ వికెట్‌ను కోల్పోయినా వెనక్కి తగ్గలేదు. లబూషేన్, స్మిత్ నిలకడగా ఆడారు. హాఫ్ సెంచరీ తర్వాత లబూషేన్.. స్టోక్స్ బౌలింగ్‌లో కీపర్ స్మిత్‌కు క్యాచ్ ఇచ్చి నిష్క్రమించాడు. కానీ గ్రీన్ (45), స్మిత్ నాలుగో వికెట్‌కు 95 రన్స్ జతచేసి ఆసీస్‌ను పటిష్ట స్థితిలో నిలిపారు. ఈ జోడీని కార్స్ 57వ ఓవర్లో నాలుగు బంతుల వ్యవధిలోనే పెవిలియన్‌కు పంపాడు. ఇంగ్లిస్ (23)ను స్టోక్స్ బౌల్డ్ చేసినా క్యారీ (46*), నెసర్ (15*) మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడ్డారు.
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ : 334
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ : 73 ఓవర్లలో 378/6 (వెదరాల్డ్ 72, లబూషేన్ 65, కార్స్ 3/113)