IND vs ENG | గువాహటి: వన్డే ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా జరుగుతున్న వార్మప్ మ్యాచ్‌లను వర్షం నీడలా వెంటాడుతున్నది. ఈ నెల 5 నుంచి మెగాటోర్నీ ప్రారంభం కానుండగా.. శనివారం భారత్, ఇంగ్లండ్ మధ్య జరగాల్సిన వార్మప్ పోరు భారీ వర్షంతో రైద్దెంది. వరుణుడి ప్రభావంతో మ్యాచ్ కాస్త ఆలస్యంగా ప్రారంభమయ్యేలా కనిపించగా.. టాస్ గెలిచిన టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ దశలో వర్షం దంచికొట్టింది. సుదీర్ఘ నిరీక్షణ అనంతరం వరుణుడు ఎంతకూ శాంతించకపోవడంతో నిర్వాహకులు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
వర్షం కారణంగా శుక్రవారం దక్షిణాఫ్రికా, అఫ్గానిస్థాన్ మధ్య మ్యాచ్ కూడా రద్దు కాగా.. శనివారం ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్ పోరుకు కూడా వరుణుడు ఆటంకం కలిగించాడు. దీంతో మ్యాచ్‌ను 23 ఓవర్లకు కుదించగా.. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్ (55) హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. అనంతరం లక్ష్యఛేదనలో నెదర్లాండ్స్ 14.2 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది. ఈ దశలో మరోమారు మ్యాచ్‌కు వర్షం అడ్డుపడింది. వార్మప్ మ్యాచ్‌ల్లో భాగంగా మంగళవారం తిరువనంతపురం వేదికగా నెదర్లాండ్స్‌తో టీమ్ఇండియా తలపడనుంది.