దుబాయ్: జింబాబ్వే, నమీబియా వేదికలుగా వచ్చే ఏడాది జరిగే ప్రతిష్టాత్మక అండర్-19 ప్రపంచకప్ టోర్నీకి అమెరికా జట్టు అర్హత సాధించింది. తద్వారా మెగాటోర్నీకి బెర్తు దక్కించుకున్న 16వ జట్టుగా అమెరికా నిలిచింది. రీజినల్ క్వాలిఫికేషన్లో భాగంగా రౌండ్‌రాబిన్ ఫార్మాట్లో జరిగిన టోర్నీలో కెనడా, బెర్ముడా, అర్జెంటీనాపై అమెరికా విజయాలు సాధించింది.
కెనడాపై 65 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన అమెరికా బెర్ముడా, అర్జెంటీనాను చిత్తుచేసి 10 పాయింట్లతో గ్రూపులో అగ్రస్థానంలో నిలిచింది. టాపార్డర్ బ్యాటర్ అమరిందర్‌సింగ్ 199 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలువగా, అన్శ్రాయ్, సాహిర్ భాటియా ఏడేసి వికెట్లతో జట్టు విజయాల్లో కీలకమయ్యారు.
2024 ప్రపంచకప్‌లో టాప్-10లో నిలిచిన జట్లు నేరుగా అర్హత సాధించగా, మిగిలిన ఆరు జట్లు రీజినల్ టోర్నీల ద్వారా బెర్తులు సొంతం చేసుకున్నాయి. ఆతిథ్య దక్షిణాఫ్రికా, జింబాబ్వే సహా భారత్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, ఐర్లాండ్, పాకిస్థాన్, న్యూజిలాండ్, శ్రీలంక, వెస్టిండీస్, అమెరికా, టాంజానియా, అఫ్గానిస్థాన్, జపాన్, స్కాట్లాండ్ అర్హత సాధించాయి.