న్యూయార్క్: సీజన్ ఆఖరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్ యుద్ధానికి సమయం ఆసన్నమైంది. ఆదివారం నుంచి న్యూయార్క్‌లోని బిల్లీజీన్ నేషనల్ స్టేడియంలో యూఎస్ గ్రాండ్‌స్లామ్ టోర్నీకి తెరలేవనుంది. గతానికి భిన్నంగా ఈసారి మిక్స్డ్ డబుల్స్ ద్వారా టోర్నీకి కొత్త కల రాగా, టైటిల్ వేట కోసం స్పెయిన్ నయా బుల్ కార్లోస్ అల్కరాజ్, ఇటలీ యువ సంచలనం జానిక్ సిన్నర్ సై అంటే సై అంటున్నారు. కోర్టులో కొదమసింహాల్లా తలపడే ఈ ఇద్దరి మధ్య పోరు అభిమానులను మునివేళ్లపై నిలబెట్టడం ఖాయంగా కనిపిస్తున్నది. ప్రపంచ టాప్-2 ప్లేయర్లుగా కొనసాగుతున్న సిన్నర్, అల్కరాజ్ మరోమారు యూఎస్ ఓపెన్ టైటిల్‌పై కన్నేశారు. ఇటీవలే వింబుల్డన్ గెలిచి సిన్నర్ మంచి జోరు మీదుంటే తానేం తక్కువ కాదంటూ అల్కరాజ్ సంకేతాలు పంపుతున్నాడు.
యూఎస్ ఓపెన్‌కు సన్నాహకంగా జరిగిన సిన్సినాటీ టోర్నీలో అల్కరాజ్ను టైటిల్ వరించగా, తుదిపోరులో సిన్నర్ అనారోగ్యంతో అర్ధాంతరంగా వైదొలిగాడు. సిన్నర్, అల్కరాజ్ చివరి ఏడు గ్రాండ్‌స్లామ్ టోర్నీ టైటిళ్లను పంచుకున్నారంటే వారి మధ్య పోటీ ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇటీవలి ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ పోరు అభిమానులకు పసందైన విందు అందించింది. సిన్నర్ గెలుస్తాడనుకున్న టైటిల్‌ను కడదాకా పోరాడి టైబ్రేక్‌లో సొంతం చేసుకున్న అల్కరాజ్ అందరి చేత శభాష్ అనిపించుకున్నాడు. ఐదున్నర గంటల పాటు సుదీర్ఘంగా సాగిన తుది సమరం సుదీర్ఘమైన ఫ్రెంచ్ ఓపెన్ చరిత్రలో ఒక మరుపురాని మ్యాచ్‌గా నిలిచిపోయింది.
చిక్కినట్లే చిక్కి చేజారిన ఫ్రెంచ్ ఓపెన్ ఓటమికి ప్రతీకారాన్ని సిన్నర్ వింబుల్డన్‌లో తీర్చుకున్నాడు. పచ్చని పచ్చికపై స్పెయిన్ బుల్ అల్కరాజ్కు కళ్లెం వేస్తూ వింబుల్డన్ ట్రోఫీని ముద్దాడాడు. చివరి గ్రాండ్‌స్లామ్ అయిన యూఎస్ ఓపెన్ టైటిల్ ఈ ఇద్దరిలో ఎవరికి దక్కతుంది అనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు దిగ్గజ ప్లేయర్ నోవాక్ జొకోవిచ్ రికార్డు స్థాయిలో 25వ టైటిల్‌పై కన్నేశాడు. ఎలాగైనా టైటిల్ కైవసం చేసుకోవాలన్న పట్టుదలతో ఉన్న ఈ సెర్బియా యోధుడికి కొత్త కుర్రాళ్లు సిన్నర్, అల్కరాజ్ నుంచి ప్రమాదం పొంచి ఉంది. మరోవైపు మహిళల సింగిల్స్‌లో అరీనా సబలెంకా, ఇగా స్వియాటెక్, కొకో గాఫ్ టైటిల్‌ను ఒడిసిపట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నారు.
విజేత: రూ.43.65 కోట్లు
రన్నరప్: రూ.21.82 కోట్లు