న్యూయార్క్: ప్రతిష్ఠాత్మక యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో స్పెయిన్ నయాబుల్ కార్లోస్ అల్కరాజ్ గార్ఫియా సెమీఫైనల్‌కు దూసుకెళ్లాడు. పురుషుల సింగిల్స్ క్వార్టర్స్ ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్ అల్కరాజ్ 6-3, 6-2, 6-4తో అలెగ్జాండర్ జ్వెరెవ్‌పై విజయం సాధించాడు. రెండున్నర గంటలపాటు సాగిన పోరులో ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వని 20 ఏండ్ల అల్కరాజ్ అద్వితీయమైన సర్వీస్‌లతో అదరగొట్టాడు. మ్యాచ్ మొత్తంలో 3 ఏస్‌లు సంధించిన అల్కరాజ్ 29 విన్నర్లు కొట్టాడు. మరోవైపు 6 ఏస్‌లు బాదిన జ్వెరెవ్ 35 అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకున్నాడు. ప్రపంచ రెండో ర్యాంకర్ నొవాక్ జొకోవిచ్ ఇప్పటికే సెమీస్‌కు చేరగా.. వీరిద్దరి మధ్య మరోసారి గ్రాండ్‌స్లామ్ ఫైనల్ జరిగే అవకాశాలున్నాయి.
వొండ్రుసోవా ఔట్
మహిళల సింగిల్స్‌లో సబలెంక, గాఫ్, ముచోవా, కైస్ సెమీఫైనల్లో అడుగుపెట్టారు. క్వార్టర్స్‌లో 17వ సీడ్ కైస్ 6-1, 6-4తో తొమ్మిదో సీడ్ వొండ్రుసోవాపై గెలిచి ముందంజ వేసింది. శుక్రవారం జరుగనున్న సెమీఫైనల్స్‌లో ముచోవాతో గాఫ్, సబలెంకతో కైస్ తలపడనున్నారు.
ఫైనల్లో బోపన్న జంట
భారత వెటరన్ ప్లేయర్ రోహన్ బోపన్న యూఎస్ ఓపెన్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. పురుషుల డబుల్స్‌లో రోహన్ బోపన్న్-మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) జంట 7-6(7/3), 6-2తో హెర్బెర్ట్-మహుట్ జోడీపై గెలిచి తుదిపోరుకు అర్హత సాధించింది.