ఢిల్లీ: భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై గత కొన్నినెలలుగా నిరాటంకంగా కొనసాగుతున్న నిషేధాన్ని కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఎత్తేసింది. 2023, డిసెంబర్ 24న డబ్ల్యూఎఫ్ఐపై సస్పెన్షన్ వేటు వేసిన కేంద్రం.. మంగళవారం దానిని తొలగించింది. ఇన్నాళ్లూ డబ్ల్యూఎఫ్ఐ కార్యకలాపాలను అడ్హక్ కమిటీ పర్యవేక్షించింది. దేశంలో రెజ్లింగ్ పోటీల నిర్వహణ, అంతర్జాతీయ టోర్నమెంట్లకు జట్ల ఎంపిక నిమిత్తం కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
త్వరలో ఆసియన్ చాంపియన్షిప్స్ జరగాల్సి ఉన్న నేపథ్యంలో తాజా నిర్ణయం రెజ్లర్లకు ఊరటనిచ్చింది. లైంగిక వేధింపుల ఆరోపణలతో పదవీచ్యుతుడైన మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ సింగ్ స్థానంలో సమాఖ్యకు ఎన్నిక నిర్వహించగా ఆ స్థానాన్ని అతడి అనుచరుడైన సంజయ్ సింగ్ గెలవడం.. గెలిచిన వెంటనే పాలకవర్గం అత్యుత్సాహం ప్రదర్శించిన నేపథ్యంలో కేంద్రం డబ్ల్యూఎఫ్ఐపై నిషేధం విధించిన విషయం విదితమే.