ఢిల్లీ : నిత్యం బీసీసీఐతో కయ్యాలకు దిగే పాకిస్థాన్ క్రికెట్‌కు తమ స్థాయి ఏంటో మరోసారి తెలిసొచ్చింది. ఐపీఎల్‌కు తామేమీ తీసిపోమన్నట్టుగా వ్యవహరించే ఆ బోర్డు.. తాజాగా పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)లో రెండు కొత్త ఫ్రాంచైజీ (సియాల్కోట్, హైదరాబాద్)లను అమ్మగా ఆ రెండింటికీ వచ్చిన బిడ్లు 12.75 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 114 కోట్లు) మాత్రమే. సియాల్కోట్ ఫ్రాంచైజీని ‘ఓజెడ్ డెవలపర్స్’ రూ. 58.38 కోట్లకు బిడ్ వేయగా హైదరాబాద్‌ను రూ. 55.57 కోట్లతో అమెరికా కంపెనీ ఎఫ్‌కేఎస్ గ్రూప్ దక్కంచుకుంది. బిడ్లు ముగిసిన తర్వాత పీఎస్ఎల్పై ట్రోల్స్ వర్షం మొదలైంది. బీసీసీఐ, ఐపీఎల్‌తో పోల్చుకునే పీసీబీ.. రెండు ఫ్రాంచైజీలకు వచ్చిన మొత్తమెంతో చూసుకుని మాట్లాడాలని నెటిజన్లు హితువు పలికారు.
హైదరాబాద్ ఫ్రాంచైజీ విలువ ఐపీఎల్లో రిషభ్ పంత్ (రూ. 27 కోట్లు), శ్రేయాస్ అయ్యర్ (రూ. 26.75) సాలరీలకు (ఇద్దరివి కలిపి రూ. 53.75 కోట్లు) దాదాపు సమానంగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు. ఐపీఎల్ 2026 వేలంలో అమ్ముడైన టాప్-9 ప్లేయర్స్‌కు వచ్చినంత మొత్తంతో పాకిస్థాన్ రెండు ఫ్రాంచైజీలకు బిడ్ వేసిందని జోకులు పేల్చుతున్నారు. కాగా 2022లో బీసీసీఐ.. లక్నో, గుజరాత్ ఫ్రాంచైజీలకు బిడ్ వేసినప్పుడు ఆ రెండు రికార్డు ధరకు అమ్ముడయ్యాయి. గుజరాత్ ఫ్రాంచైజీ విలువ రూ. 5,625 కోట్లు కాగా లక్నో జట్టును సంజీవ్ గొయెంకా ఏకంగా రూ. 7,090 కోట్లు పెట్టి సొంతం చేసుకున్నారు.