హైదరాబాద్ ఆట ప్రతినిధి/ జూబ్లీహిల్స్: రాష్ట్రంలో గ్రామీణ స్థాయి నుంచి యువ క్రీడాకారుల ప్రతిభను వెలికితీసేందుకు తొలిసారి ఏర్పాటు చేసిన తెలంగాణ జూనియర్ బాస్కెట్‌బాల్ లీగ్ (టీజేబీఎల్) హైదరాబాద్ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో అట్టహాసంగా మొదలైంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్.. తెలంగాణ బాస్కెట్‌బాల్ సంఘం (టీబీఏ) అధ్యక్షుడు రావుల శ్రీధర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎ.పృథ్వీశ్వర్ రెడ్డితో కలిసి శుక్రవారం ఈ లీగ్‌ను అధికారికంగా ప్రారంభించి, ట్రోఫీని ఆవిష్కరించారు.
ఈ నెల 28 వరకు జరిగే లీగ్‌లో అండర్ 15, 18 కేటగిరీ బాయ్స్, గర్ల్స్ విభాగాల్లో ఆరు ఫ్రాంచైజీలు (హైదరాబాద్ హరికేన్స్, నిజాం రాయల్స్, వరంగల్ స్టాలియన్స్, నల్గొండ స్పీడ్ స్ట్రైకర్స్, రంగారెడ్డి రాప్టర్స్, వికారాబాద్ మాంబాస్) పోటీ పడతాయి. ఈ లీగ్ ద్వారా అట్టడుగు స్థాయి నుంచి ప్రతిభను వెలికితీసి తెలంగాణను భారత బాస్కెట్‌బాల్ రాజధానిగా మార్చడమే తమ లక్ష్యమని శ్రీధర్ రెడ్డి తెలిపారు.