ఈసారి కొట్టనివ్వలేదు.. ఇండోర్‌లో భారత్‌దే విజయం
గత మ్యాచ్‌లో ప్రత్యర్థి ఎదుట 250 పరుగుల లక్ష్యాన్ని ఉంచినా బౌలర్ల వైఫల్యంతో ఓటమిని మూటగట్టుకున్న భారత్.. ఈసారి మాత్రం అంతకన్నా తక్కువే స్కోరు చేసినా మ్యాచ్‌ను కాపాడుకున్నది.
- అభిషేక్ మెరుపులు
- విండీస్‌ను కట్టడిచేసిన బౌలర్లు
- సిరీస్‌లో 2-1 ఆధిక్యం
ఇండోర్: ఇండోర్‌లో ఆదివారం జరిగిన మూడో టీ20లో టీమిండియా నిర్దేశించిన 224 పరుగుల ఛేదనలో వెస్టిండీస్.. 209/7 వద్దే ఆగిపోయింది. తద్వారా 14 పరుగుల తేడాతో విజయాన్ని సొంతం చేసుకున్న శ్రేయ స్ సేన.. సిరీస్‌లో 2-1 ఆధిక్యాన్ని సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్.. అభిషేక్ శర్మ (30 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్‌లతో 69) వీరవిహారానికి తోడు ఇషాన్ కిషన్ (18 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్) మెరుపులు తోడవడంతో నిర్ణీత ఓవర్లకు 223 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఛేదనలో విండీస్.. 20ఓవర్లలో 209/7కే పరిమితమైంది. హిట్మయర్ (26 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 43), కమిల్ పూరన్ (27 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 42), రూథర్‌ఫర్డ్ (32) పోరాడారు. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అర్ష్‌దీప్ సింగ్ (3/44) విండీస్‌ను కట్టడి చేశాడు. నమన్‌కు రెండు వికెట్లు దక్కాయి.
అభి ధమాకా
ప్రత్యర్థి ఆహ్వానం మేరకు మొదట బ్యాటింగ్ చేసిన భారత్ ఆరంభంలో అదరగొట్టింది. గత రెండు మ్యాచ్‌లలో విఫలమైన అభిషేక్ ఇండోర్‌లో మాత్రం దుమ్మురేపాడు. సంజూ (3) రెండో ఓవర్లోనే ఔటైనా ఛేజ్ వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్లో 4, 6, 6తో బాదుడుకు గేట్లెత్తిన ఈ పంజాబ్ కుర్రాడు.. క్రీజులో ఉన్నంతసేపు భారీ షాట్లతో అలరించాడు. ఇషాన్ సైతం పాల్ వేసిన నాలుగో ఓవర్లో మూడు ఫోర్లు సాధించాడు. ఐదో ఓవర్లో బంతినందుకున్న స్ప్రింగర్‌కు రెండు బౌండరీలు, ఒక సిక్స్‌తో స్వాగతం పలికిన అభి.. జోసెఫ్ ఓవర్లో సిక్స్, ఫోర్‌తో పాటు ఐదో బంతికి మిడ్‌వికెట్ మీదుగా డబుల్ తీసి కెరీర్లో 14వ అర్ధశతకాన్ని సాధించాడు.
అభి, ఇషాన్ దూకుడుతో పవర్ ప్లేను 87/1తో ముగించిన మెన్ ఇన్ బ్లూ.. 9వ ఓవర్ నుంచి తడబడింది. ఛేజ్ ఒకే ఓవర్లో ఇషాన్‌తో పాటు కెప్టెన్ శ్రేయస్ (1)నూ ఔట్ చేసి హోం టీమ్‌కు షాకిచ్చాడు. అభి, ఇషాన్ రెండో వికెట్‌కు 40 బంతుల్లోనే 108 రన్స్ జతచేయడం విశేషం. రెండో స్పెల్‌కు వచ్చిన స్ప్రింగర్ విసిరిన పదో ఓవర్లో భారీ షాట్ ఆడబోయిన అభి.. షాట్ అంచనా తప్పి అతడికే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. నమన్ (10) కూడా విఫలమయ్యాడు. అయితే తెలుగు క్రికెటర్లు తిలక్ వర్మ (28), నితీశ్‌కుమార్ రెడ్డి (21) ఆరో వికెట్‌కు 34 రన్స్ జోడించి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే యత్నం చేశారు. కానీ నితీశ్‌ను పాల్ ఔట్ చేయగా నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో బంతిని గమనించక తిలక్ రనౌట్ అయ్యాడు. ఆఖర్లో ప్రిన్స్ యాదవ్ (13 నాటౌట్) మూడు ఫోర్లతో స్కోరుబోర్డును 220 దాటించాడు.
కరీబియన్ల కట్టడి
రాంచీలో 250+ టార్గెట్‌ను ఛేదించిన విండీస్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్న పిచ్‌పైనా అదే జోరును కొనసాగిస్తుందా? అన్న అనుమానాల నడుమ ఛేదనకు వచ్చిన కరీబియన్లకు రెండో ఓవర్లోనే భారీ షాక్ తగిలింది. భారత పర్యటనలో సూపర్ ఫామ్‌లో ఉన్న కెప్టెన్ షై హోప్ (5)ను బౌల్డ్ చేసిన అర్ష్‌దీప్ టీమిండియాకు తొలి బ్రేక్ ఇచ్చాడు. మయాంక్ వేసిన మూడో ఓవర్లో ఇచ్చిన క్యాచ్‌ను థర్డ్‌మ్యాన్ వద్ద అభిషేక్ క్యాచ్ జారవిడవటంతో బతికిపోయిన హిట్మయర్ భారీ షాట్లు ఆడాడు. అర్ష్‌దీప్ ఓవర్లో 6, 4, 4 దంచిన అతడు నమన్ వేసిన ఏడో ఓవర్లో 4,6 రాబట్టాడు. కానీ అదే ఓవర్ ఆఖరి బంతికి క్లీన్‌బౌల్డ్ అయ్యాడు.
ఆ తర్వాత కొద్దిసేపటికే పావెల్ (5)ను అక్షర్ ఔట్ చేయగా తన ఓవర్లో మూడు సిక్స్‌లు కొట్టిన పూరన్‌ను నమన్ పెవిలియన్ చేర్చడంతో విండీస్ నాలుగో వికెట్ కోల్పోయింది. దీంతో ఆటపై పట్టు దక్కించుకున్న భారత బౌలర్లు.. వరుస వికెట్లు తీస్తూ ప్రత్యర్థిని కట్టడిచేయడంలో సఫలమయ్యారు. 18వ ఓవర్లో రూథర్‌ఫర్డ్‌ను అర్ష్‌దీప్ బౌల్డ్ చేయడంతో భారత విజయం ఖరారైంది. ఆఖరి ఓవర్లో స్ప్రింగర్ 6, 4, 6, 6 బాదినా అతడి మెరుపులు విండీస్ ఓటమి అంతరాన్ని మాత్రమే తగ్గించాయి.
సంక్షిప్త స్కోర్లు
భారత్: 20 ఓవర్లకు 223 ఆలౌట్ (అభిషేక్ 69, ఇషాన్ 37, ఛేజ్ 2/38, స్ప్రింగర్ 2/50);
వెస్టిండీస్: 20 ఓవర్లకు 209/7 (హిట్మయర్ 43, పూరన్ 42, అర్ష్‌దీప్ 3/44, నమన్ 2/39)
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

