Amir Hussain Lone | ఇటీవల క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ జమ్ముకశ్మీర్‌లో పర్యటించిన కథనాలు వార్తాపత్రికలు, సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ పర్యటనలో సచిన్ ఓ దివ్యాంగుడిని ప్రత్యేకంగా కలవడం ఎంతోమందిని ఆశ్చర్యపర్చింది. అతనే జమ్ముకశ్మీర్ పారా క్రికెట్ (దివ్యాంగుల జట్టు) టీమ్ ఆటగాడైన అమీర్ హుస్సేన్ లోన్. అనంతనాగ్ జిల్లా బిజ్బెహరా ప్రాంతానికి చెందిన లోన్ చిన్నతనంలోనే ఓ ప్రమాదంలో రెండు చేతులూ పోగొట్టుకున్నాడు. అయినప్పటికీ మొక్కవోని ధైర్యం, సంకల్పబలంతో క్రికెట్ ఆడుతున్నాడు. “నాకు క్రికెట్ అంటే ఎంతో ఇష్టం. ఏడేండ్ల వయసులోనే ఆడటం మొదలుపెట్టాను.
దురదృష్టవశాత్తూ ఎనిమిదో ఏట ఓ ప్రమాదంలో నా రెండు చేతులూ కోల్పోయాను. అక్కడినుంచే నా అసలు పోరాటం ప్రారంభమైంది” అంటాడు లోన్. మూడేండ్ల చికిత్స అనంతరం ఇంటికి చేరుకున్నాడు. నలుగురూ సానుభూతి చూపడం అతణ్ని ఎంతో బాధించేది. ఆ సమయంలో కుటుంబసభ్యులు అన్ని విధాలుగా అండగా నిలబడ్డారు. ప్రోత్సాహం అందిస్తూ వచ్చారు. అయినా అక్కడక్కడా చేదు అనుభవాలు తప్పలేదు. ఆ పరిస్థితుల్లోనూ క్రికెట్ పట్ల మమకారం చంపుకోని లోన్… కాళ్లతో బౌలింగ్ చేయడానికి ప్రయత్నించాడు. భుజం, మెడ మధ్య బ్యాట్ పెట్టుకుని ఆడేందుకు శ్రమించాడు. ఇదంత సులువైన వ్యవహారం కానేకాదు. మొదట్లో ఎంతో నొప్పిగా ఉండేది. కాలక్రమంలో ఆ పరిమితిని జయించాడు. ఆ పరిశ్రమ వృథాగా పోలేదు. తనను జమ్ముకశ్మీర్ పారా క్రికెట్ జట్టుకు తీసుకున్నారు.
కెప్టెన్‌గానూ వ్యవహరించాడు. ఎక్కడ ఆడినా కూడా.. తోటి ఆటగాళ్లు, ప్రేక్షకుల నుంచి ఆదరాభిమానాలు దక్కాయని ఆనందంగా చెబుతాడు. రోజువారీ జీవితంలోనూ కాళ్లే అతని చేతులుగా మారతాయి. టీ కప్పు తీసుకోవడం, పుస్తకం పట్టుకోవడం, ఏదైనా రాయడం, షేవింగ్ చేసుకోవడం, స్మార్ట్‌ఫోన్ పట్టుకోవడం, దువ్వుకోవడం.. ఇలా ప్రతి పనికీ కాళ్లనే ఉపయోగించుకుంటాడు. ఇతరుల మీద ఆధారపడాలని అనుకోడు. లోన్ ఆటకు అబ్బురపడిన టెండూల్కర్ 2016 లోనే తన ఆటోగ్రాఫ్‌తో కూడిన బ్యాట్‌ను బహుమతిగా పంపాడు. దివ్యాంగులు, ప్రత్యేక సామర్థ్యాలు ఉన్న పిల్లలకు అండగా నిలిస్తే.. వాళ్లంతా తాము ఎంచుకున్న రంగాల్లో రాణిస్తారని నిశ్చయంగా చెబుతాడు లోన్. ఎవ్వరైనా సరే నిరాశలో జీవితాన్ని పాడు చేసుకోవద్దని.. ఓటమిని ఒప్పుకోకుండా లక్ష్య సాధన కోసం పోరాడాలని వెన్నుతడతాడు.