కొత్తపల్లి, డిసెంబర్ 28 : కరీంనగర్ జిల్లా కేంద్రంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్టేడియంలో గత నాలుగు రోజులుగా జరిగిన తెలంగాణ రాష్ట్రస్థాయి సీనియర్స్ మహిళలు, పురుషుల కబడ్డీ పోటీలు ఆదివారం రాత్రి ముగిశాయి. పురుషుల విభాగంలో సూర్యా పేట, మహిళల విభాగంలో హైదరాబాద్-2 జట్లు విజేతలుగా నిలిచాయి. ముగింపు కార్యక్రమానికి రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ముఖ్య అతిధిగా పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు.

కరీంనగర్లో ఆదివారం రాత్రి జరిగిన మహిళల ఫైనల్ మ్యాచ్‌లో రంగారెడ్డి, హైదరాబాద్-2 జట్లు హోరా హోరీగా తలపడ్డాయి. ఇందులో హైదరాబాద్-2 జట్టు 3 పాయింట్ల తేడాతో గెలుపొంది చాంపియన్‌షిప్‌ను సాధించింది. ద్వితీయస్థానంలో రంగారెడ్డి, తృతీయ స్థానంలో ఖమ్మం, వరంగల్ జట్లు నిలిచాయి. పురుషుల విభాగంలో ఫైనల్లో సూర్యాపేట, జోగులాంబ గద్వాల జిల్లా జట్లు తలపడగా సూర్యాపేట 44-32 పాయింట్ల తేడాతో విజయం సాధించి చాంపియన్‌గా నిలిచింది.