హైదరాబాద్ (ఆట ప్రతినిధి): రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించి, అంతర్జాతీయ స్థాయిలో పతక విజేతలను తయారు చేయాల్సిన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ (శాట్) క్రీడాకారుల పట్ల పూర్తి వ్యాపార ధోరణి ప్రదర్శిస్తోంది. ప్రభుత్వ మైదానాల్లో పదులు, వందల్లో ఉన్న కోచింగ్ ఫీజులను ఏకంగా వేలల్లోకి పెంచేసి క్రీడాకారులపై మోయలేని భారం మోపడాన్ని సమర్థించుకుంది. మంగళవారం స్టేడియాల నిర్వాహకులు, కోచ్‌లు, డిప్యూటీ డైరెక్టర్లతో సమీక్ష నిర్వహించిన శాట్ చైర్మన్ శివసేనా రెడ్డి, సోనిబాలా దేవి.. ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో చదివే వారికి, రూ. 35 వేల కంటే తక్కువ ఫీజున్న విద్యార్థులకు మాత్రమే మినహాయింపు ఉంటుందని స్పష్టం చేశారు.
స్టేడియాలు, మైదానాల నిర్వహణ, సంరక్షణ, క్రీడా పరికరాల కొనుగోలు, కోచ్‌ల పారితోషికాలు, విద్యుత్ తదితర సేవల వ్యయాలు పెరగడంతోనే కోచింగ్ ఫీజులను పెంచినట్టు తెలిపారు. ప్రభుత్వ క్రీడా ప్రాంగణాల నిర్వహణ, సంరక్షణ ప్రభుత్వ బాధ్యతే అన్న విషయం మరిచి పేద, మధ్యతరగతి ఔత్సాహిక క్రీడాకారుల జేబుల నుంచే ఆ మొత్తం వసూలు చేస్తామని ఒప్పుకున్నారు. మరోవైపు క్రీడాకారుల నిరసనలను చల్లబరిచేందుకు, కంటితుడుపు చర్యగా ఫీజుల హేతుబద్ధీకరణకు కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.
క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఏడాది రాష్ట్ర బడ్జెట్లో క్రీడల కోసం రూ. 646 కోట్లు కేటాయించింది. ఇందులో కేవలం శాట్కే రూ. 500 కోట్లు ప్రకటిస్తున్నట్లు ప్రభుత్వం ఘనంగా వెల్లడించింది. ఇంత భారీ మొత్తంలో బడ్జెట్ నిధులు కేటాయించినప్పటికీ, పేద క్రీడాకారులపై ఈ ఫీజుల భారం ఎందుకు మోపుతున్నారనే ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. వందల కోట్లు నిధులు ఉండగా.. చిన్నారుల నుంచి బలవంతంగా వసూలు చేసే కోచింగ్ ఫీజులతోనే స్టేడియాల నిర్వహణ చేపట్టడం, కోచ్‌లకు పారితోషికాలు చెల్లించాలనుకోవడం క్రీడల పట్ల ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో చెప్పొచ్చని క్రీడాకారులు అంటున్నారు.