TOA Elections | హైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్(టీవోఏ) ఎన్నికలకు రంగం సిద్ధమైంది. గురువారం ఎల్బీ స్టేడియం ఒలింపిక్ భవన్ వేదికగా టీవోఏ కార్యవర్గ ఎన్నికలు జరుగనున్నాయి. అధ్యక్ష పదవి కోసం రాష్ట్ర ప్రభుత్వ క్రీడా సలహాదారు ఏపీ జితేందర్‌రెడ్డి, రాష్ట్ర బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు చాముండేశ్వర్‌నాథ్ పోటీపడుతున్నారు. ప్రధాన కార్యదర్శి, కోశాధికారి పదవుల కోసం ఎన్నిక జరుగనుండగా, మిగతా స్థానాలకు సభ్యుల ఎన్నిక లాంఛనం కానుంది. ప్రధాన కార్యదర్శి పదవి కోసం బాబురావు, మల్లారెడ్డి మధ్య పోటీ ఉండగా, కోశాధికారి కోసం సతీశ్‌గౌడ్, ప్రదీప్‌కుమార్ రేసులో ఉన్నారు. ఇదిలా ఉంటే టీవోఏ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలన్న ఉద్దేశంతో ఉన్న జితేందర్‌రెడ్డి, చాముండేశ్వర్‌నాథ్ వర్గాలు తమ ప్రయత్నాలు తీవ్రం చేశాయి.
ఆయా అసోసియేషన్లకు చెందిన సభ్యులను తమ వైపునకు తిప్పుకునేందుకు నగరంలోని ఒక హోటల్లో ప్రత్యేకంగా క్యాంప్ ఏర్పాటు చేసినట్లు తెలిసింది. దీనికి తోడు సభ్యులను డబ్బులతో ఎరవేస్తూ వారి డిమాండ్లను నెరవేర్చేందుకు వెనుకాడటం లేదని వినికిడి. మరో వర్గం అందరినీ ప్రత్యక్షంగా కలుస్తూ భారీగా హామీలు గుప్పిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. బుధవారం రాత్రి వరకు టీవోఏ ఎన్నికలపై సందిగ్ధత నెలకొన్నది. ఓటింగ్‌లో తమకు పాల్గొనే అవకాశం లేకుండా చేశారన్న ఉద్దేశంతో బాక్సింగ్ సంఘం సిటీ సివిల్కోర్టును ఆశ్రయించింది. పిటీషన్‌ను పరిశీలించిన న్యాయస్థానం ఎన్నికలు కొనసాగించవచ్చని, అయితే ఫలితాలపై స్టే విధించింది. ఈ నేపథ్యంలో ఇరు పక్షాలకు చెందిన సభ్యులు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలకు దిగారు. ప్రభుత్వంలో భాగమై ఉండటంతో పాటు జాతీయ స్పోర్ట్స్ కోడ్(2011)కు విరుద్ధంగా 70 ఏండ్ల వయసులో జితేందర్‌రెడ్డి ఎలా పోటీచేస్తారంటూ చాముండేశ్వర్‌నాథ్ వర్గం విమర్శలకు దిగింది.