ముంబై: వాంఖడే స్టేడియం వేదికగా ముంబై, విదర్భ మధ్య జరుగుతున్న రంజీ ట్రోఫీ టైటిల్ పోరు రసవత్తరంగా సాగుతున్నది. రికార్డు స్థాయిలో 42వ టైటిల్‌పై కన్నేసిన ముంబై ఆ దిశగా అడుగులు ముందుకు వేస్తున్నది. ముంబై నిర్దేశించిన 538 పరుగుల భారీ లక్ష్యఛేదనలో విదర్భ మూడో రోజు ఆట ముగిసే సరికి విదర్భ వికెట్ నష్టపోకుండా 10 పరుగులు చేసింది. ఓపెనర్లు అథర్వ (3), ధృవ్షోరె(7) క్రీజులో ఉన్నారు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు141/2 రెండో ఇన్నింగ్స్‌కు దిగిన ముంబై 418 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌నైట్ బ్యాటర్లు ముషీర్‌ఖాన్ (326 బంతుల్లో 136, 10ఫోర్లు), కెప్టెన్ రహానే (73) రాణించారు.
తన స్కోరుకు 15 పరుగులు జత చేసిన రహానే మూడో వికెట్‌గా వెనుదిరుగగా, శ్రేయాస్ అయ్యర్ (95)..ముషీర్‌ఖాన్‌కు జతకలిశాడు. వీరిద్దరు విదర్భ బౌలింగ్‌ను తుత్తునియలు చేస్తూ స్కోరుబోర్డును పరిగెత్తించారు. ముఖ్యంగా మంచి ఫామ్‌మీదున్న ముషీర్..మైదానం నలువైపులా చూడచక్కని షాట్లతో అలరించాడు. ఈ జోడీని విడదీసేందుకు విదర్భ ఎన్ని రకాలుగా ప్రయత్నించినా లాభం లేకపోయింది. 19 ఏండ్ల ముషీర్ అద్భుతమైన పరిణతి కనబరుస్తూ అయ్యర్‌తో కలిసి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఐదు పరుగుల తేడాతో అయ్యర్ శతకం చేజార్చుకోగా, నాలుగో వికెట్‌కు 168 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. ఆ తర్వాత శమ్స్ ములానీ (50 నాటౌట్) అర్ధసెంచరీతో ముంబై భారీ స్కోరు అందుకుంది. హర్ష్ దూబే(5/144) ఐదు వికెట్లతో విజృంభించాడు. ఈ మ్యాచ్‌కు క్రికెట్ దిగ్గజం సచిన్‌తో పాటు కెప్టెన్ రోహిత్‌శర్మ హాజరయ్యాడు.