విశ్వక్రీడలకు తెరలేచింది. ఇన్నాళ్లుగా ఎదురుచూసిన అద్భుత క్షణం ఆవిష్కృతమైంది. గతానికి భిన్నంగా, చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో పారిస్ ఒలింపిక్స్ ఆరంభ వేడుకలు అంబరాన్నంటాయి. చారిత్రక సీన్ నది ఒడ్డును తమ దేశ ఘనమైన వారసత్వాన్ని ప్రపంచానికి చాటిచెబుతూ ఫ్రాన్స్ ప్రారంభ వేడుకలను అదిరిపోయే రీతిలో రూపకల్పన చేసింది. ఒలింపిక్స్‌ను అందరికీ చేరువ చేయలనే రీతిలో స్టేడియానికి పరిమితం కాకుండా నదిని వేదికగా మలుచుకుంటూ క్రీడాభిమానులను కనులవిందు చేసింది. సరిగ్గా శతాబ్దం తర్వాత విశ్వక్రీడలకు ఆతిథ్యమిస్తున్న పారిస్‌ను కలకాలం గుర్తుంచుకునే రీతిలో వేడుకలు అలరించాయి. దిగ్గజ ఫుట్‌బాలర్ జినేదిన్ జిదాన్ చేతబూనిన ఒలింపిక్ టార్చ్ వీడియోతో మొదలై నదిపై ప్లేయర్ల మార్చ్‌ఫాస్ట్‌తో ప్రారంభ కార్యక్రమం అట్టహాసంగా మొదలైంది.
Paris Olympics | పారిస్: సుదీర్ఘ ఒలంపిక్ చరిత్రలో పారిస్ ఒలింపిక్స్‌కు ప్రత్యేక స్థానం దక్కింది. ఎవరూ ఊహించని రీతిలో క్రీడలకు అందరికీ దగ్గరి చేయాలనే తలంపుతో ఆరంభ వేడుకలు వినూత్న రీతిలో అదరగొట్టాయి. భారత కాలమానం ప్రకారం రాత్రి 11 గంటలకు మొదలైన ఆరంభ వేడుకలు ఫ్రాన్స్ రాజధాని పారిస్ నగరం వేదికగా మొదలయ్యాయి. ఫుట్‌బాలర్ జిదానే ఒలింపిక్ టార్చ్ పట్టుకుని పరిగెత్తగా..అతన్ని అనుసరిస్తూ కొంత మంది చిన్నారులు పడవలో ప్రయాణించడంతో ప్రారంభోత్సవ కార్యక్రమానికి తెరతీసినట్లు అయ్యింది. ఫ్రాన్స్ ప్రధాని ఎమాన్యుయెల్ మక్రాన్, అంతర్జాతీయ ఒలింపిక్ సమాఖ్య(ఐవోసీ) అధ్యక్షుడు థామస్ బాచ్ అతిథులతో పాటు అభిమానులను చేతులు ఊపుతూ మార్చ్‌పాస్ట్‌కు స్వాగతం పలికారు. వివిధ దేశాలకు చెందిన అధ్యక్షులు, ప్రధానులు, పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా హాజరయ్యారు. ఫ్యాషన్‌కు పెట్టింది పేరు అయిన పారిస్ సంస్కృతిని ప్రతిబింబిస్తూ అంతకుముందు జరిగిన షోలో పలువురు క్రీడా ప్రముఖులు తమదైన శైలిలో దుస్తులు ధరించి ఈఫిల్ టవర్ ముందు ఫొటోలు ఫోజులు ఇచ్చారు.

గ్రీస్‌తో మొదలై: ఒలింపిక్స్‌కు ఆద్యులైన గ్రీస్ దేశంతో ఒలింపిక్స్ మార్చ్‌పాస్ట్ మొదలైంది. ఆరు కిలోమీటర్ల దూరమైన పరేడ్ అస్ట్రేలిట్జ్ బ్రిడ్జ్ నుంచి మొదలైంది. సీన్ నదికి ఇరువైపులా ఉన్న అతిథులు, అభిమానులకు అభివాదం చేస్తూ ఆయా దేశాల ప్లేయర్లు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పడవల్లో ముందుకు సాగారు. తమ దేశ జాతీయ జెండాలను చేతబూని ఈలలు, కేరింతలు, హర్షధ్వానాలతో అలరించారు. గ్రీస్ తర్వాత ఐవోసీ రెఫ్యూజీ టీమ్ వరుస క్రమంలో వచ్చింది. ఫ్రెంచ్ అక్షర క్రమాన్ని అనసరిస్తూ ఆయా దేశాలకు చెందిన అథ్లెట్లు తమకు ఏర్పాటు చేసిన పడవల్లో ప్రయాణించారు. భారత్ తరఫున సింధు, శరత్ కమల్ పతకాధారులుగా వ్యవహరించారు.
85 బోట్లు, 6800 మంది అథ్లెట్లు: సీన్ నదిని ఆధారంగా చేసుకుంటూ ప్రముఖ అర్టిస్టిక్ డైరెక్టర్ థామస్ జాలీ ప్రారంభ కార్యక్రమాన్ని రూపుదిద్దారు. మొత్తం 85 బోట్లు 6800 మంది అథ్లెట్లను మోసుకుంటూ ముందుకు సాగాయి. ఇందులో 205 దేశాలకు చెందిన అథ్లెట్లు, సహాయక సిబ్బంది, అధికారులు ఉన్నారు. చారిత్రక క్యాథ్రడెల్ నోట్రె డేమ్ ద్వారా బోట్లు ప్రయాణించాయి. ఓవైపు వరుణుడు అంతరాయం కల్గించినా ఏ మాత్రం జోష్ తగ్గకుండా ఆటగాళ్లు చిరునవ్వుతో ముందుకు సాగారు.
భారీ భద్రతా మధ్య: పారిస్ ఆరంభ వేడులకు అట్టహాసంగా చేసేందుకు ఫ్రాన్స్ ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. మార్చ్‌పాస్ట్ జరిగే ప్రాంతాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుంది. మొత్తంగా 3 లక్షల మంది వీక్షించే అవకాశమున్న నేపథ్యంలో అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేశారు.
ప్రారంభ వేడుకలు ప్రారంభమైన కొద్దిసేటికి ప్రముఖ పాప్ సింగర్ లేడీ గాగా తనదైన శైలిలో పాటలు పాడుతూ అలరించింది. వైవిధ్యమైన రీతిలో డ్రెస్ ధరించిన గాగా తన గాత్రంతో మంత్రముగ్ధులను చేసింది. ఇది ముగిసిన వెంటనే ఫ్రాన్స్ విప్లవం తదితర అంశాల సమాహారంగా కార్యక్రమాలు జరిగాయి. ముసుగు వేసుకున్న ఒక వ్యక్తి ఒలింపిక్ టార్చ్ పట్టుకుని అక్కడి బిల్డింగ్‌ల పై నుంచి దాటుకుంటూ వెళ్లడం అందరికీ ఆసక్తి కల్గించింది.
నాలుగేండ్లకోమారు జరిగే ఒలింపిక్స్‌లో పతకాలు కొల్లగొట్టేందుకుని పలు దేశాల వందలాది క్రీడాకారులను తమ దేశం నుంచి పంపిస్తుంటాయి. కానీ తాజా ఒలింపిక్స్‌లో మాత్రం నాలుగు దేశాలు తమ దేశాల నుంచి ఒక్కో అథ్లెట్‌నే విశ్వక్రీడలకు పంపాయి. ఆ నాలుగు దేశాలు బెలిజ్, నవురు, సొమాలియా, లీచ్టెన్స్టెయిన్. ఈ నాలుగు దేశాల జనాభా సుమారు 20 మిలియన్లు (2 కోట్లు) మాత్రమే. లీచ్టెన్స్టెయిన్ తరఫున రొమనొ పంటెనర్ (ైస్లెక్లిస్ట్), సొమాలియా నుంచి అలి ఇడొ హసన్ (800 మీటర్ల రన్నింగ్) బరిలోకి దిగనుండగా షాన్ గిల్ (బెలిజ్), వింజర్ కకివుయె (నవురు) వంద మీటర్ల రన్నింగ్‌లో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
పారిస్: వయసు అనేది ఒక అంకె మాత్రమే అని మరోసారి చాటిచెబుతూ 58 ఏండ్ల వయసులో ఓ మహిళ ఒలింపిక్స్ బరిలో నిలిచింది. చిలీకి చెందిన టేబుల్ టెన్నిస్ ప్లేయర్ తనియా జెంగ్.. లేటు వయసులో ఈ క్రీడల్లో ఎంట్రీ ఇవ్వనుంది. చైనాలో పుట్టి టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణిగా ఎదిగిన ఆమె.. 1989లో దేశాన్ని వీడి దక్షిణ అమెరికా దేశమైన చిలీలో ఈ క్రీడను నేర్పించేందుకు వెళ్లింది. ఆట నుంచి చాలాకాలం క్రితమే వైదొలిగిన ఆమె.. కుటుంబ సభ్యుల అండతో మళ్లీ అంతర్జాతీయ స్థాయిలో రీఎంట్రీ ఇచ్చింది. గతేడాది పాన్ అమెరికన్ గేమ్స్‌లో కాంస్యం నెగ్గిన జెంగ్.. ఒలింపిక్స్‌లో పాల్గొనాలన్న తన చిరకాల కోరికను పారిస్‌తో నెరవేర్చుకుంటోంది.
