జకర్తా: పారిస్ ఒలింపిక్స్ సమీపిస్తున్న వేళ మునపటి ఫామ్‌ను అందుకోవడానికి భారత బ్యాడ్మింటన్ స్టార్లకు మరో అవకాశం. మంగళవారం నుంచి జకర్తా వేదికగా ఇండోనేషియా ఓపెన్ సూపర్ 1000 టోర్నీ మొదలుకానుంది.
ఇటీవలే ముగిసిన సింగపూర్ ఓపెన్‌లో నిరాశపరిచిన భారత షట్లర్లు జకర్తాలో అయినా పుంజుకోవాలని భావిస్తున్నారు. పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్-చిరాగ్, సింగిల్స్ విభాగాల్లో హెచ్ఎస్ ప్రణయ్, లక్ష్యసేన్, కిడాంబి శ్రీకాంత్, కిరణ్ జార్జి, ప్రియాన్షు రజావత్ బరిలో ఉన్నారు. మహిళల సింగిల్స్ విభాగంలో తెలుగమ్మాయి పీవీ సింధు అదృష్టాన్ని పరీక్షించుకోనుండగా సింగపూర్ ఓపెన్‌లో సంచలన విజయాలు నమోదుచేసిన గాయత్రి-త్రిసా ద్వయం, తనీషా-అశ్విని జంట బరిలో నిలిచారు.