హనుమకొండ చౌరస్తా, అక్టోబర్ 23: రాష్ట్రస్థాయి జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ పోటీల్లో ఖమ్మం జట్టు 115 పాయింట్లతో ఓవరాల్ చాంపియన్గా నిలిచింది. హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం (జేఎన్ఎస్)లో ములుగు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన 8వ రాష్ట్రస్థాయి జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్స్ పోటీలు ఆదివారం ముగిశాయి. రెండు రోజుల పాటు సాగిన ఈ టోర్నీలో అండర్-14, 16, 18, 20 విభాగాల్లో పోటీలు నిర్వహించగా.. 33 జిల్లాల నుంచి 1000 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ పోటీల్లో సత్తాచాటిన 80 మందిని జాతీయ స్థాయికి ఎంపిక చేసినట్లు అథ్లెటిక్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి సారంగపాణి తెలిపారు. ఈ టోర్నీ విజేతలకు పతకాలు అందించిన యువ అథ్లెట్ అగసర నందిని.. వచ్చే ఏడాది జరుగనున్న ఆసియా క్రీడల్లో బంగారు పతకం సాధించడమే తన లక్ష్యమని పేర్కొంది.