Rugby Game | ఆ అమ్మాయిలు.. పురుషాధిక్యాన్ని ప్రశ్నించారు. పేదరికాన్ని ఓడించారు. సవాళ్లను అధిగమించారు. ఇప్పుడు, ఆసియా క్రీడల్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించనున్నారు. త్వరలోనే ఆ రగ్బీ రాణెమ్మల గెలుపు కథలను పత్రికల పతాక శీర్షికలలో చూడబోతున్నాం. పతకంతో మెరిసిపోతున్న ముఖాలు టీవీల్లోనూ కనిపించొచ్చు.
అంతిమ విజయాన్ని పక్కన పెడితే, ఇక్కడి వరకూ రావడమే గొప్ప. అవును, చైనాలో జరగనున్న ఆసియా క్రీడల్లో భారత్ తరఫున రగ్బీ ఆడబోతున్న ఆ పన్నెండు మంది వెనుకా పన్నెండు కథలున్నాయి. హుపీ మఝీ ఒరిస్సాలోని మారుమూల ప్రాంతంలో పుట్టింది. ఐదేండ్ల క్రితం వరకు.. అత్యంత రహస్యంగా రగ్బీ ప్రాక్టీస్ చేసింది. ఇంట్లో తెలిస్తే ఆట ఆపేయమంటారని భయం. ఓ అంతర్జాతీయ టోర్నీలో విజయం సాధించడంతో.. పత్రికలు హుపీ బృందాన్ని ఆకాశానికెత్తేశాయి. ఫొటోలు ప్రచురించాయి. దీంతో ఆమె క్రీడాకారిణి అనే విషయం పల్లెకంతా తెలిసింది. ప్రభుత్వాధికారుల రాకపోకలు, సర్కారు నజరానాలు.. సెలెబ్రిటీని చేశాయి. ఆ ఇంటి పేదరికాన్ని పోగొట్టాయి. జనం హీరోలా చూడటం ప్రారంభించారు. డుమిన్ మర్నడీ కథ కూడా అలాంటిదే. ఆ పల్లెలో అమ్మాయిలకు ఓ గుర్తింపు, గౌరవం లేదు.
మహిళ అంటే.. పిల్లల్ని కనిపెంచే యంత్రం, వండిపెట్టే మరబొమ్మ. ఆసియా క్రీడలకు డుమిన్ ఎంపిక.. స్త్రీల పట్ల గ్రామస్థుల దృక్పథాన్నే మార్చేసింది. తమ కూతుళ్లు కూడా ఏదో ఓ ఆట ఆడాలని వాళ్లంతా కోరుతున్నారు. శ్వేత షా.. తొలి దశలో గురువు లేకపోయినా యూట్యూబ్ చూస్తూ పాఠాలు నేర్చుకుంది. తనది బీహార్లోని మారుమూల ప్రాంతం. వీళ్లే కాదు.. మామా నాయక్, వైష్ణవీ పాటిల్, కల్యాణి.. మొత్తంగా డజను జీవితాల్ని మార్చేసింది రగ్బీ క్రీడ.