ఒలింపిక్స్ తర్వాత అంతటి భారీ క్రీడా పండుగకు సర్వం సిద్ధమైంది. కరోనా కారణంగా ఏడాది ఆలస్యంగా జరుగుతున్న ఆసియా క్రీడలకు చైనాలోని హాంగ్జూలో నేడు తెరలేవనుంది. ప్రపంచ చాంపియన్ నీరజ్ చోప్రా నేతృత్వంలో భారీ బలగంతో బరిలోకి దిగుతున్న భారత బృందం సత్తాచాటేందుకు సమాయత్తమైంది.
జావెలిన్‌లో నీరజ్, బాక్సింగ్‌లో నిఖత్, బ్యాడ్మింటన్‌లో సింధు, టీటీలో శ్రీజ, లిఫ్టింగ్‌లో మీరాబాయి, రెజ్లింగ్‌లో బజరంగ్ పునియా ఇలా స్టార్లంతా కట్టకట్టుకొని దిగుతున్న టోర్నీలో భారత్ సెంచరీ కొట్టడంపైనే ప్రధానంగా దృష్టి పెట్టింది. గత క్రీడల్లో 70 మెడల్స్ నెగ్గిన మనవాళ్లు ఈ సారి ఆ సంఖ్యను వంద దాటించాలని కృతనిశ్చయంతో ఉన్నారు. చదరంగం, కబడ్డీ, హాకీ, క్రికెట్లో భారత్‌కు తిరుగులేకపోగా.. షూటింగ్, ఆర్చరీలో రికార్డులు తిరగరాసేందుకు భారత ప్లేయర్లు రెడీ అవుతున్నారు.
Asian Games | హాంగ్జూ: ఆసియా ఖండంలో అతిపెద్ద క్రీడా సంబురానికి శనివారం తెరలేవనుంది. చైనాలోని హాంగ్జూ వేదికగా నేటి నుంచి అధికారికంగా ప్రారంభం కానున్న 19వ ఆసియా క్రీడల్లో భారత్ భారీ బలగంతో బరిలోకి దిగుతున్నది. ఈ క్రీడల్లో మన దేశం నుంచి 655 మంది అథ్లెట్లు.. 39 క్రీడా విభాగాల్లో పతకాల కోసం పోటీ పడనున్నారు. 2018లో జకార్తా (ఇండోనేషియా) వేదికగా జరిగిన ఆసియా క్రీడల్లో భారత్ 70 పతకాలు (16 స్వర్ణాలు, 23 రజతాలు, 31 కాంస్యాలు) సాధించి పతకాలు పట్టికలో ఎనిమిదో స్థానంలో నిలిచింది. ఈసారి ఫుల్ జోష్‌లో ఉన్న మనవాళ్లు సెంచరీ కొట్టి ఆసియాలో మేటి క్రీడా దేశంగా నిలువాలని తహతహలాడుతున్నారు. షెడ్యూల్ ప్రకారం 2022లోనే జరగాల్సిన ఈ క్రీడలను కొవిడ్-19 కారణంగా వాయిదా వేశారు. టోక్యో ఒలింపిక్స్‌లో మెరుగైన ప్రదర్శన చేసిన భారత అథ్లెట్లు భారీ ఆశలతో ఆసియా క్రీడల బరిలోకి దిగుతుంటే.. ఇప్పటికే పలు క్రీడాంశాల్లో పోటీలు ప్రారంభమైపోయాయి. అక్టోబర్ 8 వరకు సాగనున్న ఈ టోర్నీలో హాంగ్జూతో పాటు ఐదు నగరాల్లో పోటీలు నిర్వహిస్తున్నారు. శనివారం సాయంత్రం జరుగనున్న టోర్నీ ఆరంభ వేడుకల్లో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ పాల్గొననుండగా.. హర్మన్‌ప్రీత్ సింగ్ (హాకీ కెప్టెన్), లవ్లీనా బొర్గోహై (బాక్సింగ్) భారత పతాకధారులుగా వ్యవహరించనున్నారు.
మన ముత్యాలు ఇవే!
తెలుగు రాష్ర్టాల నుంచి ఆసియా క్రీడల్లో 29 మంది అథ్లెట్లు పోటీ పడుతుండగా.. తెలంగాణ నుంచి 13 మంది బరిలోకి దిగుతున్నారు. రెండు సార్లు ప్రపంచ చాంపియన్ నిఖత్ జరీన్‌తో పాటు షూటింగ్లో ఇషాసింగ్ ఆసియా క్రీడల్లో తమదైన ముద్ర వేసేందుకు రెడీ అయ్యారు. ఇటీవలి కాలంలో అథ్లెటిక్స్‌లో నిలకడగా రాణిస్తున్న అగసర నందిని (హెప్టాథ్లాన్)పై భారీ అంచనాలు ఉండగా.. చెస్‌లో అర్జున్ ఇరగైసి, స్విమ్మింగ్‌లో వ్రిత్తి అగర్వాల్, టేబుల్ టెన్నిస్‌లో ఆకుల శ్రీజ పతకాలు గెలిచే సత్తా ఉన్న వారే.
12,000 ఆసియా క్రీడల్లో పాల్గొంటున్న అథ్లెట్ల సంఖ్య.
19 ఇవి పందొమ్మిదో ఆసియా క్రీడలు
45 పాల్గొంటున్న దేశాల సంఖ్య
481 అందుబాటులో ఉన్న స్వర్ణాలు
655 భారత్ నుంచి బరిలోకి దిగుతున్న అథ్లెట్లు
తెలంగాణ తారలు
నిఖత్ జరీన్ (బాక్సింగ్), అగసర నందిని (అథ్లెటిక్స్), గాయత్రి గోపీచంద్, సిక్కిరెడ్డి (బ్యాడ్మింటన్), ఇషాసింగ్, కైనాన్ చెనాయ్ (షూటింగ్), శ్రీజ (టీటీ), సౌమ్య గుగులోత్ (ఫుట్‌బాల్), తిలక్‌వర్మ (క్రికెట్), అర్జున్ ఇరిగైసి (చెస్), సంజన (రోలర్ స్పోర్ట్స్), ప్రీతి కొంగర (సెయిలింగ్), వ్రిత్తి అగర్వాల్ (స్విమ్మింగ్)