Team India | కాన్బెర్రా: ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా తొలి టెస్టులో కంగారూలపై భారీ తేడాతో గెలిచి జోరుమీదున్న భారత క్రికెట్ జట్టు శనివారం నుంచి ప్రైమినిస్టర్ లెవన్‌తో రెండ్రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌కు సిద్ధమైంది. వచ్చేనెల 6 నుంచి అడిలైడ్ వేదికగా జరుగబోయే డే అండ్ నైట్ పింక్ టెస్టుకు ముందు టీమ్ఇండియాకు ఇది మంచి సన్నాహకంగా ఉపయోగపడనుంది. పెర్త్ టెస్టులో ఆడని రోహిత్‌శర్మ ఈ మ్యాచ్‌లో ఆడనుండగా వేలి గాయంతో తొలి మ్యాచ్‌కు దూరమైన శుభ్‌మన్ గిల్ అడిలైడ్ టెస్టు ఆడతాడా? లేదా? అన్నదానిపై స్పష్టత వచ్చే అవకాశముంది. శుక్రవారం అతడు నెట్స్‌లో సాధన చేశాడు. రోహిత్ రాకతో కేఎల్ రాహుల్ బ్యాటింగ్ ఆర్డర్‌ను మార్చుతారా? లేక సారథే వన్ డౌన్లో వస్తాడా? అన్నది సరిచూసుకోవడానికి ప్రాక్టీస్ మ్యాచ్ భారత్‌కు మంచి అవకాశం.
పెర్త్ టెస్టులో భారీ విజయంతో మెండైన ఆత్మవిశ్వాసం సొంతం చేసుకున్న టీమ్ఇండియా..ప్రాక్టీస్ మ్యాచ్‌లో ప్రయోగాలు చేసే అవకాశముంది. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్‌పై ప్రధానంగా దృష్టి నెలకొంది. రెండో సంతానం కోసం స్వదేశంలోనే ఉండిపోయిన హిట్‌మ్యాన్ పెర్త్ టెస్టుకు దూరమయ్యాడు. ప్రాక్టీస్ మ్యాచ్ కోసం జరిగిన నెట్ ప్రాక్టీస్‌లో రోహిత్ మంచి టచ్‌లో కనిపించాడు. చివరిసారి అడిలైడ్‌లో జరిగిన డే అండ్ నైట్ టెస్టులో టీమ్ఇండియా 36 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్ బౌలింగ్ ధాటికి టెస్టుల్లో భారత్ అత్యల్ప స్కోరును మూటగట్టుకుంది. తిరిగి అలాంటి చెత్త ప్రదర్శన పునరావృతం కావద్దన్న ఉద్దేశంతో ఉన్న టీమ్ఇండియా తప్పులకు ఆస్కారం లేకుండా ముందుకు సాగుతున్నది.
రోహిత్‌కు తోడు గిల్ తుది జట్టులోకి వస్తే.. మార్పులు, చేర్పులు జరుగుతాయి. దేవదత్ పడిక్కల్, ధృవ్ జురెల్‌ను తప్పించే చాన్స్ ఉంది. దీనికి తోడు జైస్వాల్‌కు తోడుగా ఓపెనర్‌గా రోహిత్ లేదా రాహుల్ వస్తాడా అన్న దానిపై ప్రాక్టీస్ మ్యాచ్ ద్వారా ఒక స్పష్టతకు రానున్నారు. బౌలింగ్ విభాగంలో రిజర్వ్ బెంచ్‌ను పరీక్షించే అవకాశాలు ఉన్నాయి. ఆస్ట్రేలియా విషయానికొస్తే.. స్కాట్ బొలాండ్, హన్నో కోబ్స్ వంటి పేసర్లు ప్రైమినిస్టర్ లెవెన్‌లో బరిలో దిగబోతున్నారు. జాక్ ఎడ్వర్డ్స్ కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా, అండర్-19 ప్లేయర్లు చార్లీ అండర్సన్, మహ్లీ బియర్డ్‌మన్, ఐడన్ ఒ కానర్, సామ్ కొన్సాస్ ఉన్నారు.