హైదరాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలోని నార్త్స్టాండ్కు ఉన్న అజారుద్దీన్ పేరును తొలిగించవద్దని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ)కు హైకోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎలాంటి కఠిన చర్యలు తీసుకోరాదని ఆదేశాలు ఇస్తూ, తదుపరి విచారణ వాయిదా వేసింది. స్టేడియంలోని నార్త్ స్టాండ్‌కున్న అజారుద్దీన్ పేరును తొలిగించాలని హెచ్‌సీఏ అంబుడ్స్‌మన్ జస్టిస్ వంగ ఈశ్వరయ్య ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు.
తన పేరును తొలిగించడాన్ని సవాల్ చేస్తూ భారత మాజీ కెప్టెన్ అజారుద్దీన్ దాఖలు చేసిన పిటీషన్‌ను జస్టిస్ పల్లా కార్తీక్ విచారణ చేపట్టారు. పిటీషనర్ పదేళ్ల పాటు భారత జట్టుకు కెప్టెన్‌గా, రెండు దశాబ్దాల పాటు క్రికెటర్‌గా దేశం తరఫున సేవలందించినట్లు న్యాయవాది చెప్పారు. అంబుడ్స్‌మన్ ఆదేశాలపై స్టే ఇవ్వాలని కోరారు. వాదనల తర్వాత న్యాయమూర్తి తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు నార్త్స్టాండ్ పేరు తొలిగింపు విషయంలో ఎలాంటి చర్యలు చేపట్టవద్దని హెచ్‌సీఏను ఆదేశించారు.