అహ్మదాబాద్: ప్రతిష్ఠాత్మక జాతీయ క్రీడల్లో తెలంగాణ పతాక సగర్వంగా ఎగిరింది. ప్రత్యర్థులకు దీటైన సవాల్ విసురుతూ రాష్ట్ర యువ బాక్సర్ మహమ్మద్ హుసాముద్దీన్ పసిడి పతకంతో మెరిశాడు. బుధవారం జరిగిన పురుషుల 57కిలోల ఫైనల్ బౌట్లో సర్వీసెస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డు(ఎస్‌ఎస్‌సీబీ) తరఫున బరిలోకి దిగిన హుసామ్ 3-1 తేడాతో సచిన్ సివాచ్(హర్యానా)పై అద్భుత విజయం సాధించాడు. ఆది నుంచే తనదైన జోరు కనబరిచిన ఈ ఇందూరు బాక్సర్ విసిరిన పంచ్‌లకు ప్రత్యర్థి నుంచి సరైన సమాధానం లేకపోయింది. రింగ్‌లో చురుకుగా కదిలిన హుసామ్..సచిన్ ఎత్తులకు పైఎత్తు వేస్తూ కీలక పాయింట్లు ఖాతాలో వేసుకున్నాడు.
అదునుచూసి దెబ్బకొడుతూ తన పంచ్ పవర్‌కు తిరుగులేదని నిరూపించాడు. హుసామ్ విసిరిన పంచ్‌లకు దీటైన సమాధానం ఇవ్వడంలో విఫలమైన హర్యానా బాక్సర్ ఓటమి వైపు నిలువాల్సి వచ్చింది. ఇటీవలే బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్‌లో కాంస్య పతకం సాధించిన ఈ 28 ఏండ్ల యువ బాక్సర్ మరోమారు జాతీయస్థాయిలో సత్తాచాటి ఆకట్టుకున్నాడు. తాను పోటీపడుతున్న విభాగంలో తీవ్ర పోటీ నెలకొన్న ఎక్కడా వెనుకకకు తగ్గకుండా బౌట్ బౌట్‌కు తన ఆధిపత్యాన్ని అంతకంతకూ పెంచుకుంటూ పోయాడు.
తెలంగాణ @ 15: గుజరాత్ వేదికగా జరిగిన 36వ జాతీయ క్రీడలను తెలంగాణ 15వ స్థానంతో ముగించింది. టోర్నీలో 8 స్వర్ణాలు, 7 రజతాలు, 8 కాంస్య పతకాలు మొత్తంగా 23 పతకాలతో రాష్ట్రం 15వ స్థానంలో నిలిచింది. టోర్నీలో యువ స్విమ్మర్ వ్రితి అగర్వాల్ నాలుగు పతకాలతో సత్తాచాటింది. ఓవరాల్‌గా ఎస్‌ఎస్‌సీబీ 61 స్వర్ణాలు, 35 రజతాలు, 32 కాంస్యాలతో అగ్రస్థానంలో నిలువగా, మహారాష్ట్ర(140), హర్యానా (116) వరుసగా రెండు, మూడు స్థానాలు కైవసం చేసుకున్నాయి. వ్యక్తిగత విభాగాల్లో సజన్ ప్రకాశ్(కేరళ), హశిక రామచంద్ర(కర్ణాటక) అవార్డులు దక్కించుకున్నారు.
ఇదిలా ఉంటే జాతీయ క్రీడల ముగింపు ఉత్సవాలు సూరత్‌లో అట్టహాసంగా జరిగాయి. కండ్లు మిరుమిట్లు గొలిపే లేజర్ లైట్ల వెలుతురులో అభిమానుల సందోహం మధ్య సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షకులను అలరించాయి. ముగింపు కార్యక్రమానికి భారత ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్కర్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. 2023లో జాతీయ క్రీడలకు ఆతిథ్యమిస్తున్న గోవాకు భారత ఒలింపిక్ సంఘ(ఐవోఏ) ప్రతినిధులు జెండా అందజేశారు.