లండన్: వింబుల్డన్ మహిళల సింగిల్స్‌లో 17 ఏండ్ల తర్వాత ఒకే దేశానికి చెందిన ఇద్దరు అమ్మాయిల మధ్య ఫైనల్ జరగనుంది. చెక్ రిపబ్లిక్ ప్లేయర్లు కరోలినా ముచోవా, లిండా నొస్కోవా స్ఫూర్తిదాయక ప్రదర్శనతో ఈ టోర్నీలో తొలిసారి టైటిల్ పోరుకు అర్హత సాధించారు. అమెరికా సిస్టర్స్ సెరెనా విలియమ్స్, వీనస్ (2009)తర్వాత ఒకేదేశానికి చెందిన ప్లేయర్ల మధ్య టైటిల్ ఫైట్ ఇదే మొదటిసారి కానుంది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి సెమీస్‌లో ముచోవా 6-2, 1-6, 7-6 (12/10)తో అమెరికా స్టార్, ఏడో సీడ్ కోకో గాఫ్‌ను ఓడించి ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. ఈ టోర్నీలో తొలిసారి సెమీస్‌కు అర్హత సాధించిన ఆమె.. కీలక పోరులోనూ తనకంటే మెరుగైన ర్యాంకు కల్గిన గాఫ్నకు చుక్కలు చూపించింది.
మూడు సెట్లలో 2.15 గంటల హోరాహోరీ పోరులో ఈ పదో సీడ్ చెక్ భామ.. నిర్ణయాత్మక మూడో సెట్ టైబ్రేక్‌కు దారితీసినా పోరాటాన్ని కొనసాగిస్తూ ప్రత్యర్థికి చెక్‌పెట్టింది. ముచోవా తొలి సెట్‌ను అలవోకగా గెలుచుకున్నా గాఫ్ రెండో సెట్లో అనూహ్యంగా పుంజుకుని ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. 3 ఏస్‌లు, 11 విన్నర్లతో విరుచుకుపడి సెట్‌ను 6-1తో కైవసం చేసుకుంది. నిర్ణయాత్మక మూడో సెట్లో విజయం కోసం ఇరువురూ నువ్వానేనా అన్నట్టుగా తలపడటంతో సెట్ కాస్తా టైబ్రేక్‌కు దారితీసింది. టైబ్రేకర్‌లో బలమైన ఫోర్‌హ్యాండ్ షాట్లతో విరుచుకుపడ్డ ముచోవా.. మూడేండ్ల తర్వాత గ్రాండ్‌స్లామ్ టోర్నీ టైటిల్ పోరుకు చేరుకుంది. మ్యాచ్‌లో ముచోవా 31 విన్నర్లు కొట్టి 32 అనవసర తప్పిదాలు చేయగా గాఫ్ 2 డబుల్ ఫాల్ట్స్, 35 తప్పిదాలతో మూల్యం చెల్లించుకుంది.
మరో సెమీస్‌లో తొమ్మిదో సీడ్ నొస్కోవా6-4, 6-4తో ఉక్రెయిన్ స్టార్ కొస్ట్యుక్ను ఓడించి తొలి గ్రాండ్‌స్లామ్ ఫైనల్‌కు క్వాలిఫై అయింది. గంటా 19 నిమిషాల్లోనే ముగిసిన మ్యాచ్‌లో ప్రత్యర్థి నుంచి కనీస ప్రతిఘటన లేకుండానే ఆమె మ్యాచ్‌ను ముగించింది. రెండు సెట్లలోనూ కొస్ట్యుక్పై ఆధిపత్యం ప్రదర్శించిన 21 ఏండ్ల నొస్కోవా శనివారం ముచోవాతో అమీతుమీ తేల్చుకో నుంది.