Bhajan Kaur | అంటల్య: ‘ఫైనల్ ఒలింపిక్ క్వాలిఫయర్స్’లో భారత యువ ఆర్చర్ భజన్ కౌర్ స్వర్ణ పతకం గెలిచి సత్తా చాటింది. టర్కీ వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో 18 ఏండ్ల కౌర్.. మహిళల వ్యక్తిగత రికర్వ్ ఈవెంట్ ఫైనల్లో 6-2 (28-26, 29-29, 29-26, 29-29)తో మొబినా ఫల్లా (ఇరాన్)ను మట్టికరిపించి పసిడి గెలుచుకుంది. పూర్తి ఏకపక్షంగా సాగిన ఫైనల్లో నెగ్గిన కౌర్.. పారిస్ ఒలింపిక్స్‌లో బెర్తునూ సాధించింది.
ఈ ఈవెంట్లో మూడో సీడ్‌గా బరిలోకి దిగిన కౌర్.. బిషిండె (మంగోలియా), ఉర్స (స్లోవేనియా)ను ఓడించి సెమీఫైనల్ చేరింది. సెమీస్‌లో అలెగ్జాండ్రాను చిత్తచేసి ఫైనల్‌కు అర్హత సాధించింది. ఇదే పోటీలలో మరో భారత ఆర్చర్ అంకిత.. క్వార్టర్స్ చేరడంతో ఆమె కూడా పారిస్ కోటా దక్కించుకుంది. భారత స్టార్ ఆర్చర్ దీపికా కుమారి తొలి రౌండ్లోనే వెనుదిరిగి నిరాశపరిచింది.